తండ్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చేరడం కోసం సంవత్సరంకు పైగా ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇంకా ముహర్తం కుదరక పోవడానికి మామ నందమూరి బాలకృష్ణ అడ్డుపడటమే కారణంగా తెలుస్తున్నది. బావమరిది అడ్డుపడుతూ ఉండటంతో ముఖ్యమంత్రి సహితం ఎటూ తేల్చుకోలేక మంత్రివర్గం పుననిర్మాణాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్లు కనబడుతున్నది.
గత సంవత్సరం దసరా పూర్తి కాగానే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని అంటూ కొడుకుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నామనే సంకేతాన్ని చంద్రబాబునాయుడు ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం దసరా కూడా దాటిపోయినా మంత్రివర్గం మార్పుల గురించిన ప్రస్తావననే ఆయన తీసుకు రావడం లేదు. దానితో పార్టీలో మంత్రిపదవులు కోసం ఎదురు చూస్తున్న వారు అసహనానికి గురవుతున్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తానే మంత్రివర్గంలో చేరాలని కోరుకొంటున్నారు. ఆ విషయం స్పష్టంగా బావగారికి చెప్పకపోయినా సంకేతాలు మాత్రం ఇచ్చారని అంటున్నారు. అయితే ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఆయనతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న దృష్ట్యా మంత్రిపదవి ఇవ్వడం భవిష్యత్లో తలనొప్పిగా మారవచ్చని అనుమానంతో చంద్రబాబునాయుడు అందుకు స్దిదపడే అవకాశం లేదని పార్టీలో అందరికి తెలిసిందే.
తన సన్నిహితుల వద్ద ఇప్పుడే లోకేష్ కు మంత్రిపదవి ఇవ్వడం మంచిది కాదని బాలకృష్ణ యధాలాపంగా అంటూనే ఉన్నారు. “ఇప్పుడే మంత్రిపదవి ఇస్తే అతని రాజకీయ ఎదుగుదలకు అడ్డు కాగలదు. మరి కొంత అనుభవం రాజకీయాలలో తెచ్చుకోవాలి” అంటూ ఈ మధ్య ఒక సన్నిహితుడివద్ద అన్నట్లు తెలిసింది. లోకేష్ ను కాబోయే ముఖ్యమంత్రిగా అందరూ చూస్తున్న సమయంలో తొందరపడి మంత్రి పదవి ఇవ్వడం వల్లన నష్టం జరుగవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే లోకేష్ కు మామ బాలకృష్ణతో మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. బాలకృష్ణకు దగ్గరగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలతోనే ఎక్కువ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఆయా మంత్రులకు వారి సొంత జిల్లాలో వ్యతిరేకంగా ఉండే మంత్రులను లోకేష్ దగ్గరకు కూడా రానీయరని పార్టీ వర్గాలలో వినిపిస్తున్నది.