దురుద్దేశ పూర్వకంగా ఫేక్ న్యూస్లు వేసి వ్యక్తిగతంగా నన్ను డీఫేం చేయాలని చూసిన సాక్షిపై పోరాటం మొదలుపెట్టానని శిక్షించేదాకా వదలి పెట్టనని నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖలో తనపై సాక్షి చేసిన తప్పుడు ప్రచారాలపై తాను దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ పై మూడో సారి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. వ్యక్తిగత పనుల కోసం వ్యక్తిగతంగానే ఖర్చు పెట్టుకుంటామని..ప్రభుత్వ డబ్బుతో వ్యక్తిగత ఖర్చు చేసే సంస్కృతి మాది కాదు. మా తల్లి నాకు అది నేర్పించలేదు.. నారా లోకేష్ స్పష్టం చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ వాటానే 25.3 శాతంగా ఉందని ఆయన సగర్వంగా ప్రకటించారు. అంటే దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతి నాలుగు రూపాయల పెట్టుబడిలో ఒక రూపాయి ఏపీకే వస్తోందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతోందని ధీమా వ్యక్తం చేశారు.
పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు కేటాయించడంపై వస్తున్న విమర్శలను లోకేష్ తిప్పికొట్టారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చి, యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే మా ప్రాధాన్యత. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు వస్తే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అటువంటప్పుడు ఉపాధి కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే విశాఖలో ఐటీ, ఫార్మా, డేటా సెంటర్ల హబ్ సిద్ధమవుతోందని, రాబోయే పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని విశాఖ అధిగమిస్తుందని జోస్యం చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విశాఖ ప్రజల ఆస్తి అని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనివ్వబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా మంత్రి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలను స్వాగతిస్తామని, కానీ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడితే మాత్రం సహించబోమని హెచ్చరించారు.
