మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన చిల్లర దొంగలను పట్టుకుని గజదొంగలను వదిలేస్తున్నారు అనే వ్యాఖ్యలకు లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బొత్స ఉద్దేశించిన ఆ గజదొంగ జగన్ మోహన్ రెడ్డియేనా అని ఆయన ప్రశ్నించారు.అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో తమపై స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి ఆరు అక్రమ కేసులు పెట్టారని, కానీ చార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడు గవర్నర్ లేదా , స్పీకర్ నుంచి కనీసం ఒక్క ఆధారంతోనైనా అనుమతి పొందలేకపోయారని గుర్తుచేశారు. మద్యం స్కాంలో సిట్ విచారణలో అసలు విషయాలన్నీ బయటకు వస్తున్నాయని, అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకోలేరని లోకేష్ స్పష్టం చేసారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు.. వివేకాను హత్య చేసి కత్తినితమ చేతిలో పెట్టిన లాంటివేనన్నారు. VSR ఏవియేషన్స్తో హెరిటేజ్ సంస్థకు ఎలాంటి లావాదేవీలు లేవని, కనీసం ఒక కప్పు కాఫీ కూడా కలిసి తాగలేదని ఆయన స్పష్టం చేశారు. 2022లో హెరిటేజ్ ఫిన్ లీజ్ వద్ద ఫైనాన్స్ తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తామని గానీ, తమ ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతారని గానీ ముందే ఊహించడానికి తామేమీ జ్యోతిష్యులం కాదని ఎద్దేవా చేశారు. జగన్ చేసే నిరాధార ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అంశాలపై త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన నోట్ విడుదల చేస్తామని లోకేష్ వెల్లడించారు.
ఎమ్మెల్యేలకు నిర్వహించబోయే ఓరియంటేషన్ క్లాసుల గురించి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలందరికీ రెసిడెన్షియల్ క్లాసులు ఉంటాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తే, తామంతా విద్యార్థుల్లా కూర్చుని నేర్చుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే ఈ సమావేశాలు రాజకీయాలకు అతీతంగా, కేవలం కుటుంబం అనే కాన్సెప్ట్‌తో ఆత్మీయంగా సాగుతాయని ఆయన వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో తాను కూడా అందరితో పాటే ఉండి చురుగ్గా పాల్గొంటానని లోకేష్ పేర్కొన్నారు.
