ఇటీజ్ క్లియర్ : లోకేష్ ఎమ్మెల్సీ, తరువాతే మంత్రి!

శాసనమండలిలో గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో మరో పార్టీకి చోటే లేకుండా చేయాలని, తెలుగుదేశం అభ్యర్థులు గెలిచితీరాలని పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించేశారు. శనివారం ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ”ఓటర్ల నమోదుకి 27రోజులే గడువుంది. ఈలోగా అనుకూలంగా ఉన్న అర్హులందర్నీ ఓటర్ల జాబితాలో చేర్పించాలి. ఏ ఒక్కరినీ వదల కూడదు అని చంద్రబాబు ఆదేశించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కుమారుడు అయిన లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ”విజ్ఞప్తులు, వత్తిళ్ళు” పార్టీనుంచి పెరుగుతున్నాయి. ఆయన కోసం సీటు ఖాళీ చేయడానికి నలుగురు ఇప్పటికే ముందుకి వచ్చారు.

అయితే, ఇలా ఏ ఒక్కరికో ఆబ్లిగేట్ అయివుండటం అత్యున్నత స్ధాయిలో వున్న చంద్రబాబుకి సహజంగానే ఇష్టం వుండదు. అంతకు మించి ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపి అవ్వడం కోసం ఆస్ధానంలో వున్న చిన్న్నాన్న వివేకానంద రెడ్డిని సీటుదించేశారు. ఈ మచ్చ జీవితాంతం జగన్ ని వెన్నంటే వుంటుంది. ఇదే పరిస్ధితి తన కుటుంబానికి రావడం ఇష్టం లేకే చంద్రబాబు ఇతరుల సీటులోకి లోకేష్ ను తీసుకురాలేదు. మంత్రివర్గం లోకి లోకేష్ ను తీసుకుని ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ గా ఎన్నిక చేయించవచ్చు. ఇప్పటికే రాజ్యాంగేతర శక్తిగా ముద్రపడిన లోకేష్ ను ”పద్ధతి ప్రకారమే” మంత్రిని చేయాలన్న ఆలోచనతోనే మంత్రివర్గ విస్తరణను చంద్రబాబు వాయిదా వేస్తున్నారన్న భావన పార్టీవర్గాల్లో వుంది. ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి లోకేష్ ను పోటీ చేయిస్తే విద్యావంతుల యువప్రతినిధిగా ఆయన మంత్రివర్గంలో ”సొంత” లేబుల్ వేసుకునే అవకాశం వుంది.

పరోక్ష ఎన్నిక అయిన శాసనమండలి ఎన్నికల మీద ఇంతకు ముందెన్నడూ లేనంత సునిశితంగా చంద్రబాబు దృష్టిపెట్టడాన్ని ఉదాహరిస్తూ ”లోకేష్ ఎమ్మెల్సీ అవ్వడమే ఆలస్యం ఆతరువాతే మంత్రివర్గ విస్తరణ” అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు విశ్లేషించారు.

ఇకముందు ప్రత్యక్ష ఎన్నికల్తో సమానంగా పరోక్ష ఎన్నికల్ని కూడా ఎదుర్కోవాలని టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు వెల్లడించారు. ” ఓటర్ల నమోదు నుంచి పోలింగ్‌ వరకు ప్రతి అంశంలోనూ పార్టీ నాయకులంతా విధిగా పాల్గోవాలి. పరోక్ష ఎన్నికలు కూడా పార్టీ పటిష్టతకు హెల్ప్ అవుతాయి. ఈ ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి రిఫ్లెక్షన్స్ అవుతాయి. రెండున్నరేళ్ళ తెలుగుదేశం పాలనా సామర్థ్యానికి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలుగా వీటిని పారామీటర్లుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి చోటులేకుండా అన్ని ఎన్నికల్లోనూ ఓడించితీరాలి” అని బాబు ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com