మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్ర విభజన చట్టానికి కీలక సవరణలు చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత కల్పించినందున ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపేందుకు వెళ్తున్నారు. గురువారం మధ్యాహ్నం రాజ్యసభలోనూ అమరావతి బిల్ పాస్ కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ఏపీ భవిష్యత్తుకు, రాజధాని నిర్మాణానికి ఎంతో ఊతమిస్తుందని లోకేష్ భావిస్తున్నారు.
మంత్రి లోకేష్‌కు ప్రధాని కార్యాలయం నుండి అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ భవనంలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించినందుకు ఏపీ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున లోకేష్ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఇతర కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
కేంద్ర బడ్జెట్లో అమరావతికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు, ఇప్పుడు చట్టసవరణ ద్వారా రాజధాని హోదాను పదిలం చేయడంతో కూటమి ప్రభుత్వంలో ఉత్సాహం నెలకొంది. ప్రధానితో భేటీ అనంతరం, లోకేష్ మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం , రాష్ట్రానికి రావలసిన ఇతర ప్రాజెక్టుల గురించి ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు.


