యూఏఈలో ఎవరో అనిల్ కుమార్ కు.. 240 కోట్ల లాటరీ వచ్చేసిందని ఆహో ఓహో అని ప్రచారం చేసేస్తోంది మీడియా. ఒక్క అనిల్ కుమార్ కే కాదు.. లాటరీలు ఎవరికి వచ్చినట్లుగా సమాచారం వచ్చినా..వాళ్లేదో జీవితంలో గొప్ప విజయం సాధించారని డబ్బాకొట్టేస్తూంటారు. వారేమీ విజయం సాధించలేదు. జస్ట్ లాటరీ కొట్టారంతే. కానీ ఈ లాటరీ పేరుతో ఎంత మంది జీవితాలను నాశనం చేసేందుకు ఉత్ప్రేరకంగా మారుతున్నారో మాత్రం ఈ మీడియా సంస్థలు ఆలోచించడం లేదు. లాటరీ తగిలిన వాడే కళ్ల ముందు కనిపిస్తాడు. కానీ ఆ లాటరీ కొన్న మిగతా వాళ్ల సంగతేంటి అన్నది ఎవరూ ఆలోచించరు.
ఆ లాటరీ డబ్బులు ఎంతో మంది కష్టమే !
యూఏఈలో లాటరీలు చట్టబద్ధం. అందుకే అక్కడ ఆ అనిల్ కుమార్ కొన్నాడు. ఆయనకే కాదు.. అప్పుడప్పుడు చాలా మందికి ఈ లాటరీలు తగియాలని ప్రచారం జరుగుతూ ఉంటుంది. నిజంగానే తగలొచ్చు కూడా. అంత లాటరీల ప్రైజ్ మనీ ఇస్తున్నారంటే.. వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ?. ఈ ప్రచారం చూసి ఆశపడి.. కొనేవాళ్లు పెరిగిపోతూ ఉంటారు. అందుకే వారికి డబ్బులు ఇబ్బడిమబ్బడిగా వస్తాయి. వాటి నుంచి కొంత ఇలా ఓ జాక్ పాట్ ఒకరికి ఇచ్చి.. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటాయి. యూఏఈ లాటరీ అయినా మరకొటి అయినా ఇదే పరిస్థితి.
ఇలాంటి ప్రచారాలతో లాటరీలకు బానిసయ్యేవారి డబ్బులే అవి !
లాటరీ అనేది ఎప్పటికీ లాటరీనే. అది విజయం కాదు. ఇంకా చెప్పాలంటే అది ఎంతో మంది కష్టపడి సంపాదించుకుని.. లాటరీ పై ఆశతో అక్కడ పోసిన సొమ్ము అది. కష్టపడకుండా.. ఈ జాక్ పాట్ కొట్టిన వాళ్లకు ఆ సొమ్ము లభిస్తోంది. మిగతాది.. నిర్వాహకుల జేబుల్లోకి వెళ్తుంది. రూ. 240 కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందంటే.. ఐదు వందల కోట్ల రూపాయల మేర వారు లాటరీ టిక్కెట్లు అమ్మేసి ఉంటారు. అది నిరంతర ప్రవాహం. వ్యసనం. లాటరీలు కొనే అలవాటు ఉన్న ఈ అనిల్ కుమార్.. ఇప్పుడు వచ్చిన డబ్బుతో వ్యసనాన్ని మరింత పెంచుకుంటాడు. అది సహజం. లాటరీలు రాని వాళ్లు కూడా అతన్ని చూసి ఇస్స్పయిర్ అవుతారు. దాని వల్ల లాభపడేది ఒక్క లాటరీ నిర్వహకులే.
కష్టపడితే వచ్చే డబ్బులకే విలువ
కౌన్ బనేగా కరోడ్ పతిలో.. ఎంతో మంది విన్నర్లు ఉన్నారు. చాలా సీజన్లలో నిరుపేదలు కోట్లు గెల్చుకున్నారు. అలా గెల్చుకున్నవారు ఇప్పుడు తమ ప్రైజ్ మనీ మొత్తం ఖర్చు పెట్టేసుకుని ఇప్పుడు రోడ్డున పడి ఉన్నారు. అప్పనంగా వచ్చిన సొమ్మును వారు సరిగ్గా డీల్ చేయలేకపోయారన్నమాట. ఏదైనా అంతే. మాకు లాటరీ తగిలితే భలే ఉంటుందని అనుకుంటారు. అలా అనుకునేవారికి వంద కోట్లు వచ్చినా.. బికారిగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ఎందుకంటే వారికి డబ్బు విలువ తెలియదు. అలాంటి అత్యాశపరుల్ని టార్గెట్ చేసుకుని లాటరీల బిజినెస్ చేసుకోవడానికే…ఇలాంటి వార్తల్ని హైలెట్ చేస్తూంటారు. దీని వల్ల ఎవరైనా లాటరీకి బానిసలుగా మారితే.. ఆ కుటుంబమే నాశనం అవుతుంది. అందుకే లాటరీల ప్రచారం పెద్ద స్కామ్ !