వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై ఆగ్రహం తెచ్చుకునే అనేక మంది ఉన్నతాధికారుల్ని ఆకట్టుకున్నారు. వారందరినీ గరిష్టంగా ఉపయోగించుకున్నారు. ముందూ వెనుకా చూసుకోకుండా వారంతా అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. తర్వాత పదవులు పొందారు. కానీ తర్వాత నిరాదరణకు గురయ్యారు. ప్రస్తుతం అలాంటి అధికారులకు ఎక్కడా ప్రాధాన్యత దక్కడం లేదు. కొంత మంది పని లేని పోస్టులతో జీతం తీసుకుంటూ కాలక్షేపం చేస్తూంటే కొంత మంది బయటకు వెళ్లి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి లిస్టులో ప్రముఖంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ వంటి వారు ఉన్నారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితునిగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ప్రాముఖ్యత కలిగిన పోస్టులు పొందినా.. ఎన్నికల సమయానికి ప్లేట్ ఫిరాయించి జగన్ ఆదేశాలకు అనుగుణం పవర్లోకి రాక ముందే వ్యవహరించారు. పవర్లోకి వచ్చాక సీఎస్ అయ్యారు. కానీ ఆయనను ఎక్కువ రోజులు ఉండనీయలేదు. అవమానకరంగా పంపేశారు. ఇప్పుడు ఆయన తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మత మార్పిళ్లు.. హిందూ ధర్మం అంశాలపై స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తోందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒకప్పుడు జగన్కు ఆత్మీయుడు కావడంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధన్యత ఏర్పడుతోంది.
ఇక రిటైర్డ్ ఐఎస్ పీవీ రమేష్ ఆర్థిక అంశాలపై స్పందిస్తున్నారు. ఆయన వైఎస్ టైం నుంచి వారికి విధేయుడు. జగన్ అధికారంలోకి వచ్చే నాటికి కేంద్ర సర్వీసులో ఉన్న పీవీరమేష్ను రాష్ట్రానికి తీసుకొచ్చి కీలక బాధ్యతలిచ్చారు. రిటైరైన తర్వాత సలహాదారుగా పెట్టుకున్నారు. తర్వాత బయటకు పంపేశారు. ఆయన ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలను నిశితంగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఆయనపై ఏపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడింది. కొన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆయన వెనక్కు తగ్గకుండా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
కరివేపాకులా వాడుకుని తీసి పడేశారన్న అసంతృప్తితో ఉన్న అధికారులు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఐవైఆర్ బీజేపీలో చేరి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారి మరికొందరు తెరపైకి వస్తారని.. జగన్ గతంలో పాటించిన వ్యూహం ఇప్పుడు రివర్స్ అవబోతోందన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.