ఈతరం ప్రేమలో కన్‌ఫ్యూజన్ ఉంది. వాళ్ల ఆలోచనల్లో, తీసుకునే నిర్ణయాల్లో, వేసే అడుగుల్లో, చూసే చూపులో.. ఒకటేంటీ జీవితంలోనే కన్‌ఫ్యూజన్ ఉంది. ప్రేమలో ఇంకాస్త ఎక్కువే ఉంది. అలాంటి గందరగోళమైన జీవితాల్ని సినిమాగా తీయాలంటే – ముందు కథలో ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి. ఏం చెబుతున్నాం? ఎందుకు చెబుతున్నాం? అనే పాయింట్ పై మరింత ఫోకస్ ఉండాలి. అలా కాకుండా ఓ గజిబిజి కథని… ఇంకాస్త గందరగోళ పడి తీస్తే – అది – మా వింత గాథ వినుమా లా తయారవుతుంది.
సిద్దూ (సిద్దూ జొన్నలగడ్డ) ఇంజనీరింగ్ స్టూడెంట్. తన క్లాస్ మేట్ వినీతా వేణుగోపాల్ (సీరత్ కపూర్)ని ఇష్టపడతాడు. తాను ముందు… మౌనంగా ఉన్నా, క్రమంగా సిద్దూపై ప్రేమ పెంచుకుంటుంది. అయితే ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలూ వేరు. సిద్దూ ఎలాంటి నిర్ణయం అయినా తొందరపడి తీసుకుంటాడు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. కానీ వినీతా అలా కాదు. ప్రతీ చిన్న విషయంలోనూ బాగా ఆలోచిస్తుంది. వినీత అన్నయ్య కార్తీక్ (కమల్ కామరాజు) పెళ్లి కుదురుతుంది. ప్రీ ఫొటో షూట్ కోసం అంతా కలిసి గోవా వెళ్తారు. అక్కడ.. సిద్దూ చేసిన చిన్న తప్పు వల్ల.. ఆ ఫొటో షూట్ కాన్సిల్ అవుతుంది. ఆ తరవాత.. జరిగిన పరిణామాల్లో.. అక్కడికక్కడే సిద్దూ – వినీతా పెళ్లి చేసుకుంటారు. తాగిన మైకంలో.. వాళ్ల అల్లరిని స్నేహితుడొకరు వీడియో తీస్తే, తెల్లారేసరికి అది వైరల్ అయిపోతుంది. ఆ ఒక్క వీడియో వల్ల.. ఎవరి జీవితాలు ఎలా మారిపోయాయి? సిద్దూ, వినీతల మధ్య ఎలాంటి అగాథం ఏర్పడింది? అన్నదే కథ.
గంటా నలభై నిమిషాల సినిమా ఇది. నిజానికి సినిమా సైజుకి బాగా తక్కువ. కానీ… నాలుగ్గంటల సినిమాచూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దానికి కారణం.. అత్యంత నెమ్మదైన నేరేషన్. కాలేజీ సన్నివేశాల్లో ఎలాంటి కొత్తదనం ఉండదు. తన కథని ఓ పోలీస్ అధికారికి (తనికెళ్లభరణి)కి చెప్పుకుంటూ పోవడం, కాస్త ప్రజెంట్, ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్ వస్తుండడం మినహా కథనంలో మ్యాజిక్కులు జిమ్మిక్కులూ ఉండవు. తన కథని ఒకరికి చెబుతూ పోవడం కూడా కొత్త స్క్రీన్ ప్లే కాదు. అది కూడా లేకపోతే… ఈ కథ మరింత ఫ్లాట్ గా కనిపిస్తుంది.
ఇది వైరల్ యుగం. ఏది ఎందుకు ఎప్పుడు ఎలా వైరల్ అయిపోతుందో తెలీదు. ఓ చిన్న తప్పు వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అవుతాయి? అన్న పాయింట్ తో ఈ కథ తీద్దామనుకుంటే దానికే ఫిక్సవ్వాల్సింది. ఆ పాయింట్ ఎక్కడో సెకండాఫ్‌లో కనిపిస్తుంది. దాన్ని కూడా ఎఫెక్టీగా చెప్పలేకపోయారు. యువతరం ప్రేమలో గందరగోళం ఉంది, మితిమీరిన స్వేచ్ఛ మంచిది కాదు.. అన్నదే చెప్పాలనుకుంటే, కనీసం దానిపై అయినా ఫోకస్ పెట్టాల్సింది. ఇవన్నీ కలిపి చెప్పడం వల్ల కథంతా కలగాపులగం అయిపోయింది. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థంలోనే ఎమోషన్ వుంది. వైరల్ వీడియో వల్ల చెదిరిపోయిన మనసులు.. మరో వీడియోలో చెప్పిన మాటలకు అతుక్కుంటాయి. అంతగా కన్వెన్స్ చేసే మాటలు అందులో ఏం ఉన్నాయో అర్థం కాదు. దర్శకుడు తనని తాను కన్వెన్స్ అయిపోయి.. రాసుకున్న సన్నివేశంలా అనిపిస్తుంది.
కృష్ణ అండ్ హిజ్ లీలాస్ తో.. మెప్పించాడు సిద్దు జొన్నలగడ్డ. రొమాంటిక్ కామెడీ చిత్రాలకు తాను సరిపోతానని నిరూపించుకునే ఛాన్స్ దక్కింది. ఇప్పుడు `మా వింత గాథ వినుమా` కోసమూ.. అలాంటి జోనరే ఎంచుకున్నాడు. నటన పరంగా.. తను ఓకే. ఈ చిత్రానికి కథ కూడా తానే అందించాడు. దాంతో ఆ భారమూ తాను మోయాల్సివచ్చింది. ఓసారి ప్యూర్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు. వెంటనే.. మామూలు డైలాగులు మొదలెట్టేస్తాడు. ఇంత వేరియేషన్ ఏమిటో అర్థం కాదు. సీరత్ కపూర్ బొమ్మలా కనిపించింది. ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ పలకలేదు. తనికెళ్లభరణి అనుభవం ఆ పాత్రకు ఉపయోగపడింది. జేపీ, కమల్ కామరాజు…. వీళ్లంతా యధావిధిగా నటించుకుంటూ వెళ్లిపోయారు.
ఈ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు. మంచి పాట ఇస్తే.. ఆ క్రెడిట్ ఇంకెవరికైనా వెళ్లిపోతుందేమో అనుకుని, అంత సాహసం చేయలేదు. ఓ బ్రీత్ లెస్ సాంగ్ ఈ సినిమాలో వినిపిస్తుంది. ఆ పాటలో పదాలేంటో కనిపెట్టిన వాళ్లకు వీరతాళ్లు వేయొచ్చు. బడ్జెట్ పరిమితుల్లో తీసిన సినిమా ఇది. ఓటీటీకి ఇవ్వాల్సిందే అని ముందే ఫిక్సయ్యారేమో. ఆ బడ్జెట్‌కి తగ్గట్టు సినిమా తీశారు. కథలోని పాయింట్ మంచిదే. కానీ దాన్ని చెప్పడంలో.. దర్శకుడు తడబడ్డాడు.
ఫినిషింగ్ టచ్: వింత లేదు.. అంతా విసుగే