Madharaasi Movie Review
తెలుగు రేటింగ్: 2.25/5
హీరోలే కాదు దర్శకులూ ఫామ్‌లోకి రావడం చాలా ముఖ్యం. గజనీ, తుపాకి, కత్తి లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన మురుగదాస్ ఇప్పుడు ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్నారు. సల్మాన్ ఖాన్‌తో తీసిన సికిందర్ సినిమా అయితే మరీ దారుణం. మురుగ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయాడా? అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలాంటి సమయంలో శివకార్తికేయన్‌తో కలసి ‘మదరాసి’ సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమాతో మురుగ ఫామ్‌లోకి వచ్చారా? అమరన్ తర్వాత శివకి మరో హిట్ పడిందా?
నార్త్ నుంచి తమిళనాడుకి ఆరు భారీ కంటైనర్ల గన్స్ అక్రమంగా ప్రవేశిస్తాయి. ఆ గన్స్ గనుక పంపిణీ జరిగితే తమిళనాడు గన్ కల్చర్ కి అడ్డాగా మారుతుంది. వీటిని అడ్డుకోవడానికి ప్రేమ్ (బిజు మీనన్) నాయకత్వంలో ఎన్ఐఏ రంగంలోకి దిగుతుంది. ఈ ఆపరేషన్లోకి అనూహ్యంగా రఘు (శివకార్తికేయన్) వస్తాడు. అసలు ఈ రఘు ఎవరు? మాలతి (రుక్మిణి వసంత్)తో తన ప్రేమకథ ఏమిటి? ఆ లవ్ స్టోరీ, ఈ ఆపరేషన్‌లో ఎలాంటి పాత్ర పోషించింది? అనేది తెరపై చూడాలి.
మురుగదాస్ కథల్లో అంతర్లీనంగా ఓ సందేశం ఉంటుంది. మదరాసి కూడా ఓ నీతి కథలాంటిదే. ”ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు కాపాడాలనుకోవడం జబ్బు కాదు.. వరం” లైన్‌తో మదరాసి కథని అల్లుకున్నాడు మురుగ. అయితే ఈ అల్లిక కొన్నిచోట్ల బలంగా, చాలా చోట్ల పేలవంగా తయారైంది.
మదరాసి కథలో యూఎస్పీ హీరో క్యారెక్టరైజేషన్. కష్టంలో ఉన్నది ఎవరైనా సరే తన కుటుంబమే అని భ్రమించే (డిల్యూషన్ డిస్ఆర్డర్) వున్న హీరో. దీనికి మురుగ ఇచ్చిన ఫ్లాష్‌బ్యాక్ కూడా నమ్మశక్యంగానే ఉంది. అదే క్యారెక్టర్‌కి ఒక లవ్ స్టోరీ పెట్టారు. అది రొటీన్‌కి కొంచెం భిన్నంగానే ఉంది. అయితే ఈ క్యారెక్టర్‌కి, ఎన్ఐఏ ఆపరేషన్‌కి, గన్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌కి సింక్ కుదరకపోవడంతో తెరపై జరుగుతున్న యాక్షన్ అంతా హడావుడిగానే ఉంటుంది కానీ అందులో ఎమోషన్ ఆడియన్స్‌కి పట్టదు.
భారీ కంటైనర్ల ఛేజ్ సీక్వెన్స్‌తో మొదలైన కథ రఘు పాత్ర ఎంట్రీతో లవ్ స్టోరీ వైపు తిరుగుతుంది. హాస్పిటల్లో రఘు, ప్రేమ్ పాత్రల మధ్య నడిచే సీన్స్, ఈ కథలోకి రఘుని తీసుకురావడం అంత ఆర్గానిక్‌గా అనిపించదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం ఆ ప్రేమకథ ఏమవుతుందా? అనే ఆసక్తిని పెంచగలిగింది. సెకండ్ హాఫ్ లో మదరాసికి అసలు కష్టం మొదలవుతుంది. ఎన్ఐఏ ఆఫీస్‌పై ఎటాక్ తర్వాత ఈ కథ క్లూలెస్‌గా మారిపోతుంది. చాలా వరకూ సీన్స్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ అయితే మరీ కన్వినియంట్ రైటింగ్ అనిపిస్తుంది. కోమాలో ఉన్న విలన్ జిమ్ నుంచి బయటికి వచ్చినవాడిలా కమాండో స్టయిల్లో ఫైట్లు చేసేయడం, బుల్లెట్ల వర్షంలో కూడా హీరో సింపుల్‌గా నడుస్తూ వెళ్ళిపోవడం, నాలుగు బుల్లెట్లు తగిలినా హీరోయిన్ని శుభం కార్డు కోసం వాడుకోవడం.. ఇదంతా లాజిక్కులకు ఆమడదూరంలో ఉంటుంది. కాకపోతే.. మదరాసిలో చెప్పుకోదగ్గ అంశాలూ ఉన్నాయి. నార్మల్, అబ్నార్మల్ గురించి చెప్పే సీక్వెన్స్‌లో మురుగదాస్ మెరుస్తాడు. హీరో క్యారెక్టర్లో రేంజ్ బావుంది. హెవీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ జానర్‌ని ఇష్టపడే ఆడియన్స్‌కి నచ్చే అవకాశం ఉంది.
రఘు పాత్రలో శివకార్తికేయన్ కొత్తగా కనిపించాడు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం శివకి ఇదే తొలిసారి. రుక్మిణి వసంత్ ఎప్పటిలానే అందంగా కనిపించింది. తన ప్రెజెన్స్ ప్రేమకథకి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. బిజు మీనన్‌ని సరిగ్గా వాడుకోలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. విరాట్ పాత్రలో కనిపించిన విద్యుత్ జమ్వాల్ తనవరకూ న్యాయం చేశాడు. నిజానికి తనతో కలసి ఫైట్లు చేయడం అంత ఈజీ కాదు. ఓపెనింగ్ సీక్వెన్స్‌లో విద్యుత్ రోడ్‌పై ఓ ఫైట్ చేస్తుంటాడు. తన ట్రాక్ రికార్డ్ తెలిసిన ఆడియన్స్ మదరాసి యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే అంచనాకి వస్తారు. అయితే అలాంటి ఫైటర్ ని హాస్పిటల్ బెడ్‌కే పరిమితం చేసి మళ్ళీ క్లైమాక్స్‌కి గానీ తీసుకురాలేదు. షబీర్ కల్లరక్కల్కి మంచి పాత్రే పడింది.
అనిరుథ్ కంపోజ్ చేసిన ‘సెలవిక’ పాటలో శివ చేసిన డ్యాన్స్ క్యాచీగా ఉంది. నేపథ్య సంగీతంలో ఆశించిన మెరుపులు లేవు. అన్నట్టుగా క్లైమాక్స్ బీజీఎంలో డాక్టర్ వరుణ్‌తో మ్యూజిక్ క్రాస్ఓవర్ చేశాడు. తాను చేసిన సినిమాల బీజీఎంలను కలిపికొట్టేయడం అనిరుథ్కి ఓ ముచ్చటగా మారిపోయింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరగా కాస్త పదునుగా ఉండాల్సింది. ఎమోషన్ కనెక్షన్ లేనప్పుడు ఫైట్లు కుదించేస్తేనే మేలు. ప్రతీ ఫైటూ సుదీర్ఘంగా, నమ్మశక్యం కాని రేంజ్లో జరిగిపోతూ ఉంటుంది. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి.
మురుగదాస్ మదరాసిలో ఓ క్రేజీ క్యారెక్టర్ని పట్టుకున్నాడు. ఈ కథ వెనుక తన ఉద్దేశం కూడా మంచిదే. కానీ తెరపైకి వచ్చిన కథనం మాత్రం తేడా కొట్టింది. కాకపోతే.. అవుట్‌డేటెడ్ ట్రీట్మెంట్తో సికిందర్లాంటి డిజాస్టర్ ఇచ్చిన మురుగదాస్.. తనలో ఇంకా కొంత స్పార్క్ మిగిలే ఉందని మాత్రం మదరాసితో చెప్పగలిగాడు.
తెలుగు రేటింగ్: 2.25/5