పహల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కీలకంగా పని చేసిన కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగగా.. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్డా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సింధూర్ తో పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుందని, ఈ ఆపరేషన్ చేపట్టే క్రమంలో సైన్యంకు పూర్తి అధికారాలు కట్టబెట్టినందుకు సైన్యం ప్రధాని మోడీ కాళ్లు మొక్కాలని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదులను మేపుతున్న పాక్ కు , ఆ దేశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని నిరూపించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు జగదీశ్ దేవ్డా.
ఈ ఘనత వహించిన ప్రధాని మోడీ కాళ్లను దేశప్రజలతోపాటు సైన్యం మొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ కు బుద్ధి చెప్పిన ప్రధానికి ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు కూడా రావడం లేదని వ్యాఖ్యానించారు. జగదీశ్ దేవ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇది సైన్యాన్ని , వారి సాహసాలను అవమానించేలా ఉందని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన జగదీశ్ దేవ్డాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తోంది.