టీవీకే విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్ర అంటూ ఆయన పార్టీ తరపున దాఖలు చేసిసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తోసిపుచ్చింది. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంటే ఎలా నిర్ణయం తీసుకుంటామని ప్రశ్నిచింది. ఈ సందర్భంగా కనీస ఏర్పాట్లు లేకుండా సభను నిర్వహించడం ఏమిటని ప్రశ్నించింది. విజయ్‌కు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. అలా ఎలా అనుమతులు ఇచ్చారని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. సరైన విధి విధానాలు రూపొందించే వరకూ అన్ని భారీ యాత్రలకు అనుమతులు ఇవ్వవొద్దని స్పష్టం చేసింది.
అదే సమయంలో తమపై కేసులు పెడుతున్నారని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీవీకే నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో ధర్మాసనం మరింత తీవ్రంగా స్పందించింది. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత టీవీకే నాయకులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించిది. ఇంత భారీ విషాదం జరిగిన తర్వాత బాధితుల్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విజయ్ వాహనాన్ని అధికారులు ఎందుకు సీజ్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్స్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరూర్ ఘటన విషయాన్ని రాజకీయ కుట్రగా చేయాలనుకుంటున్న విజయ్ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విచారణ చేస్తే..తప్పిదం అంతా టీవీకేపై నెట్టివేస్తారన్న అభిప్రాయంతో.. సీబీఐ విచారణ అడిగారు. కానీ అలాంటి అవకాశం లేకపోగా ఇప్పుడు తప్పిదం జరిగిన తర్వాత టీవీకే నేతలు కనిపించకుండా పోవడంపై ఇప్పుడు విచారణ ప్రారంభమవుతోంది.