భారతీయ న్యాయ చరిత్రలోనే అత్యంత అరుదైన, కఠినమైన తీర్పు తమిళనాడులోని మధురై జిల్లా కోర్టు ఇచ్చింది. ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. దీనికి కారణం వీరంతా కలిసి తండ్రీకొడుకుల్ని లాకప్ డెత్ చేయడమే. 2020 లాక్డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన నెపంతో తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్‌లను అదుపులోకి తీసుకుని, వారి మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసు అధికారులకు మదురై జిల్లా కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి, అమానవీయ హింసకు పాల్పడటం అత్యంత తీవ్రమైన నేరమని ధర్మాసనం స్పష్టం చేసింది.
జూన్ 2020లో తూత్తుకుడి జిల్లాలో మొబైల్ షాపు నడుపుతున్న జయరాజ్, బెన్నిక్స్‌లను స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఆ రాత్రంతా పైశాచికంగా చిత్రహింసలకు గురిచేశారు. లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బెన్నిక్స్ జూన్ 22న, ఆయన తండ్రి జయరాజ్ జూన్ 23న ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసు వ్యవస్థలోని అరాచకత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ కేసును సిబిఐ లోతుగా విచారించింది. ఆ రాత్రి స్టేషన్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ముందుకు వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఈ కేసులో కీలకమైంది. రక్తంతో నిండిన స్టేషన్ గోడలు, తండ్రీకొడుకుల ఆర్తనాదాలు, సాక్ష్యాలను తుడిచివేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ఆమె కళ్లకు కట్టినట్లు వివరించింది. నిందితులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పక్కా కుట్రతో ఈ హత్యలకు పాల్పడ్డారని సిబిఐ గట్టి సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచింది.
హత్య, కుట్ర, సాక్ష్యాధారాల చెరిపివేత ఆరోపణలు రుజువు కావడంతో.. ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ సహా తొమ్మిది మందికి ఉరిశిక్ష ఖరారైంది. లాకప్‌లో సామాన్యుడికి రక్షణ లేకపోతే సమాజంలో అరాచకం పెరుగుతుంది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో శిక్షలు పడటమే అరుదైన తరుణంలో, ఏకకాలంలో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష పడటం భారత న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని సూచిస్తోంది.