మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తాడని ఆశలు పెట్టుకున్న మాడ్వీ హిడ్మా ఏపీలోని అల్లూరి జిల్లా అడవుల్లో ఎన్ కౌంటర్ అయ్యారు. నిర్బంధం పెరిగిపోవడంతో షెల్టర్ కోసం పెద్దగా నిఘా ఉండదని భావించి అల్లూరి జిల్లా అటవీ ప్రాంతంలోకి తన టీమ్‌తో మాడ్వీ హిడ్మా వచ్చారు. కానీ ఏపీ ఇంటలిజెన్స్ కు పక్కా సమాచారం అందడంతో..ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా నేతృత్వంలో ఆపరేషన్ పూర్తి చేశారు.
మావోయిస్టుకేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మాడ్వీ హిడ్మా వయసు 44 ఏళ్లు. ఎన్ కౌంటర్ లో అతని భార్యతో పాటు మరో నలుగురు చనిపోయారు. మొత్తం ఆరుగురు మృతదేహాలను కనుగొన్నారు. 1981లో సుక్మా లో గోతుల్ వంశంలో జన్మించిన మడ్వి హిడ్మా, మావోయిస్ట్ పార్టీలో త్వరగా ఎదిగాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ (పీఎల్‌జిఏ) బటాలియన్ నాయకుడిగా పనిచేసిన ఆయన, సీపీఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్సులో చేరిన ఏకైక సభ్యుడు. బస్తర్ ప్రాంతానికి చెందిన ఏకైక ట్రైబల్ సభ్యుడిగా పార్టీలో ముఖ్య పాత్ర పోషించాడు.
భద్రతా బలగాలపై 26 సార్లు దాడి చేసి ఆయుధాలు అపహరించడంలో కీలక పాత్ర పోషించాడు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల దాడులకు ఆయన మాస్టర్ మైండ్‌గా పేరు పొందాడు. మావోయిస్టు నాయకత్వం అంతా వృద్ధులే. వారిలో చాలా మంది చనిపోయారు. కొంత మందిలొంగిపోయారు. మిగిలిన ఉన్న వారిలో ఉద్యమానికి ఊపిరి పోసేది హిడ్మానే అనుకున్నారు. కానీ ఆయన ఏపీ ఇంటలిజెన్స్ కు దొరికిపోయాడు. ఈ ఘటనతో.. వచ్చే ఏడాది మార్చి 31కి మావోయిస్టులు లేకుండా చేస్తామన్న అమిత్ షా సంకల్పం వైపు మరో భారీ అడుగు పడిందని అనుకోవచ్చు.
