మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రూపాలీ చామణ్కర్కు సంబంధించినవని చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అభ్యంతరకర వీడియోలు , ఒక జ్యోతిష్యుడితో ముడిపడి ఉన్న శృంగార వివాదం చివరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలీ చామణ్కర్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించాయి. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆమె తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి సమర్పించారు.
ఈ వివాదం ఒక జ్యోతిష్యుడితో సన్నిహితంగా ఉన్నట్లు చూపే వీడియోలు బహిర్గతం కావడంతో మొదలైంది. ఆ వీడియోలు తనవి కావని, అవి డీప్ ఫేక్ సాంకేతికతతో సృష్టించినవని రూపాలీ చామణ్కర్ వాదించినప్పటికీ, రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర దుమారం రేగింది. మహిళల హక్కులను కాపాడాల్సిన, వారికి ఆదర్శంగా నిలవాల్సిన కమిషన్ అధినేత ఇలాంటి వ్యక్తిగత బలహీనతలకు లోనవ్వడం ఆ సంస్థ గౌరవాన్ని దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వీడియోలు విపరీతంగా షేర్ కావడంతో ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడింది. ఆమె ఎన్సీపీ పార్టీకి చెందిన వారు.
జ్యోతిష్యుడు అశోక్ ఖారత్ ( వ్యవహారం కేవలం ఒక వైరల్ వీడియోతో ముగిసిపోలేదు, దీని వెనుక చీకటి కోణాలు అనేకం ఉన్నాయి. సదరు జ్యోతిష్యుడిపై ఇప్పటికే పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఇతను జ్యోతిష్యం పేరుతో మహిళలను నమ్మించి, వారి వ్యక్తిగత సమస్యలను ఆసరాగా చేసుకుని లోబర్చుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. సుమారు 75 మందికి పైగా మహిళలు ఇతని చేతిలో లైంగికంగా, ఆర్థికంగా మోసపోయారని చెబుతున్నారు. ముఖ్యంగా అతని వద్దకు వచ్చే యువతులు, మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకోవడమే కాకుండా, వారి అశ్లీల వీడియోలను రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడేవాడనే అభియోగాలు అతనిపై నమోదయ్యాయి.
