పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చీలిక ఉదంతం మరువక ముందే, ఇప్పుడు జాతీయ రాజకీయాల ఫోకస్ మహారాష్ట్ర వైపు మళ్లింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన కి చెందిన మెజారిటీ ఎంపీలు రాబోయే 48 గంటల్లో అధికార ఏకనాథ్ షిండే వర్గంలోకి మారబోతున్నారంటూ ఆపరేషన్ టైగర్ ప్రారంభమయిందని పుకార్లు ప్రారంభమయ్యాయి.
ఉద్ధవ్ థాక్రే శివసేన ఫైర్‌బ్రాండ్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హారాష్ట్ర ఎంపీలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి 15 కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఒక ఎంపీని లొంగదీసుకోవడానికి కనీస మద్దతు ధర 50 కోట్లుగా ఫిక్స్ చేశారని, అందులో ఈ పదిహేను కోట్లు కేవలం అడ్వాన్స్ మాత్రమేనని ఆయన పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎంపీలు ఫిరాయిస్తారని తెలిసి వారిపై ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు రౌత్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని షిండే వర్గం అంటోంది.
శివసేనకి ఉన్న మొత్తం 9 మంది లోక్‌సభ ఎంపీలలో దాదాపు 6 గురు ఎంపీలు అధికార షిండే వర్గంతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ముంబైలో ఉద్ధవ్ థాకరే అత్యవసరంగా పిలిచిన కీలక సమావేశానికి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే ప్రత్యక్షంగా హాజరు కావడం, మిగిలిన వారి ఫోన్లు స్విచ్చాఫ్ రావడం లేదా నాట్ రీచబుల్ అని చూపించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఇప్పటికే కొందరు తిరుగుబాటు ఎంపీలు ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లలో దిల్లీ చేరుకుని, లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు సమాచారం.
