‘మ‌హ‌ర్షి’ ట్రైల‌ర్‌: ఓట‌మి తెలియ‌ని రిషి క‌థ‌

మ‌హ‌ర్షి నుంచి వ‌చ్చిన‌ టీజ‌ర్, పాట‌లు… మ‌హేష్ అభిమానుల్ని నూటికి నూరుశాతం మెప్పించ‌లేక‌పోయాయి. వాళ్ల ఆశ‌ల‌న్నీ ట్రైల‌ర్‌పైనే. ఈ ట్రైల‌ర్‌తో ఈ సినిమా హైప్ పెరుగుతుంద‌ని వాళ్లెంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఆశ‌ల్ని చిత్ర‌బృందం వ‌మ్ము చేయ‌లేదు. ఈ సినిమా స్థాయి, స్టామినా చూపించేలానే ట్రైల‌ర్ క‌ట్ చేసింది. ఇది ఓట‌మి తెలియ‌ని రిషి క‌థ‌. అత‌ను ఎదిగిన క్ర‌మం. త‌న ల‌క్ష్యాలు, స్నేహితులు, కాలేజీ జీవితం.. ఇదే `మ‌హ‌ర్షి`.

సంసాదించ‌డం ఒక్క‌టే జీవితమ‌ని, అదే గెలుప‌ని అనుకునే రుషి.. మాన‌వ సంబంధాల విలువ ఎలా తెలుసుకున్నాడు? తెలుసుకున్నాక ఏం చేశాడు? అనేది మ‌హ‌ర్షిలో చూడొచ్చు. ఈ సినిమా క‌థేమిటో, క‌థానాయ‌కుడి వ్య‌క్తిత్వం ఏమిటో ట్రైల‌ర్‌లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌బృందం. ఎక్కువ‌గా రుషి అనే పాత్ర‌, త‌న ఆలోచ‌న విధానంపై ఫోక‌స్ పెట్టారు. పూజా (పూజా హెగ్డే), ర‌వి (న‌రేష్‌) పాత్ర‌ల‌తో రుషికి ఉన్న అనుబంధాన్నీ చూపించారు. దాంతో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాలూ పేర్చుకుంటూ వెళ్లారు. చూపించిన ఒక్క ఫైట్‌.. ఎగ్ర‌సీవ్‌గా అనిపిస్తుంది. పాట‌ల‌తో నిరుత్సాహ‌ప‌రిచిన దేవిశ్రీ ప్ర‌సాద్ నేప‌థ్య సంగీతంలో మాత్రం త‌న మార్క్ చూపించాడేమో అనిపిస్తోంది. మ‌హేష్ ఈ సినిమాలో వివిధ ర‌కాల లుక్స్‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. కాలేజీ స్టూడెంట్‌గా త‌న లుక్ బాగుంది. మాస్‌కి న‌చ్చుతుంది కూడా. మొత్తానికి ట్రైల‌ర్‌లోని ఎమోష‌న్స్‌, డైలాగులు, హీరోయిజం చూస్తుంటే… ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వంట‌కం సిద్ధ‌మైపోయిన‌ట్టు తెలుస్తూనే ఉంది. మ‌రి ఆ రుచి ఎలాంటిదో ఈనెల 9న ప్రేక్ష‌కులే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.