మహేశ్‌బాబు, రాజమౌళి సినిమాకి ‘వారణాసి’ టైటిల్‌ను ఖరారు చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టైటిల్‌తో పాటు ‘వారణాసి’ యూనివర్స్ ని పరిచయం చేశారు. దాదాపు నాలుగు నిమిషాల నిడివి గల వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రాజమౌళి చూపించిన విజువల్స్ మాటలకి అందడం లేదు. యుగాలు, ఖండాలు, దేశాలు, భూమి, ఆకాశం, అంతరిక్షం, చరిత్ర, ఇతిహాసం, పురాణాలని.. ఈ వీడియోలో చూపించిన తీరు అద్భుతం.
మహేశ్‌బాబు రుద్ర పాత్రలో కనిపించారు. ఆ పాత్రని, వారణాసి టైటిల్ రివిల్ చేసిన తీరు ప్రేక్షకులని కట్టిపడేసింది. రామాయణంలోని ఓ కీలక ఘట్టంతో ఈ కథ ముడిపడి వుంది. ఇందులో మహేష్ రాముడిగా కనిపిస్తారని స్వయంగా రాజమౌళి చెప్పారు. అయితే కాశీలో ఆయన పేరు రుద్ర. శ్రీమహా విష్ణు అవతారానికి, రుద్రకి.. రాజమౌళి ఎలాంటి ముడి వేసి ఈ కథని నడిపారో అనే ఆసక్తి పెరుగుపోతుంది.
వీడియోలో విజువల్స్, గ్రాఫిక్ వర్క్, మ్యూజిక్ అత్యున్నతంగా వున్నాయి. ఈ వీడియో చూశాక.. వెండితెరపై రాజమౌళి ఓ దృశ్యకావ్యాన్ని ఆవిష్కరిస్తున్నారనిపించింది. 2027 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

