మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కబోతోంది. మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే శ్రీమంతుడు కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది. చేతిలో కావల్సినంత సమయం ఉండడంతో కొరటాల శివ స్క్రిప్టును మరింత పదునుగా చెక్కుతున్నాడని తెలుస్తోంది. ఈలోగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా మల్టీస్టారర్ అట. మహేష్ తో పాటు మరో కథానాయకుడూ ఇందులో కనిపిస్తారని తెలుస్తోంది. కథానాయకుడు అంటే.. చిన్నా చితకా హీరో కాదు. ఓ అగ్ర కథానాయకుడే ఉంటారట. అంటే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రేంజు పాత్రన్నమాట.
మహేష్, వెంకీ కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఇద్దరూ కలసి నటించారు. అందుకే వెంకీ కాకుండా మరో హీరో అయితే బాగుంటుందని కొరటాల భావిస్తున్నాడు. నాగార్జున అయితే ఈ తరహా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపింస్తుంటారు. మహేష్ బాబు అంటే నాగ్ కి ప్రత్యేకమైన అభిమానం కూడా. ఒకవేళ ఈ కాంబినేషన్ కష్టమైతే.. అప్పుడు బాలీవుడ్ నుంచో, తమిళం నుంచో మరో హీరోని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. ఆ స్టార్ హీరో కోసం కొరటాల శివ ముందస్తు కసరత్తులు చేస్తున్నాడని టాక్. డిసెంబరులోగానీ, 2017 జనవరిలో గానీ మహేష్ – కొరటాల సినిమా సెట్స్‌పైకి వెళ్లే అకాశం ఉంది. ఈలోగా ఆ హీరోని పట్టేస్తారేమో చూడాలి.