ప్రస్తుతం రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఇది పాన్ వరల్డ్ సినిమా. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. రాజమౌళితో ఓ సినిమా చేస్తే – ఎలాంటి హీరో కెరీర్ అయినా ఉచ్ఛదశలోకి వెళ్లిపోవడం ఖాయం. అయితే ఆ తరువాతి సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మహేష్ కూడా తదుపరి సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు.
మహేష్ కోసం టాలీవుడ్ లో ముగ్గురు దర్శకులు కథలు రెడీ చేస్తున్నారు. ‘పెద్ది’ తరవాత బుచ్చిబాబు మహేష్ తో ఓ సినిమా చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ‘వన్’ చిత్రానికి బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా పని చేశాడు. అప్పటి నుంచే మహేష్‌తో మంచి అనుబంధం వుంది. ‘ఉప్పెన’ తరవాత కూడా మహేష్ – బుచ్చి కలుసుకొన్నారు. ఓ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు. ‘పెద్ది’ అయ్యాక బుచ్చి మహేష్ కథపై ఫోకస్ పెడతాడు.
సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. `యానిమల్` కథని ముందు మహేష్ కే వినిపించాడు సందీప్. అయితే.. ఆ కథలో ఉన్న ‘రా’ కంటెంట్ కి మహేష్ భయపడ్డాడు. అలాంటి సన్నివేశాల్లో ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకొంటారో అని ఆలోచించాడు. కాకపోతే.. సందీప్ కమిట్మెంట్ మహేష్‌కి నచ్చింది. అందుకే మరో కథ ఉంటే తీసుకొనిరా.. అంటూ అప్పుడే చెప్పాడట. సందీప్ కూడా మహేష్ తో ఓ సినిమా చేయాలని గట్టిగా ఫిక్సయ్యాడు. ‘స్పిరిట్’ తరవాత ఆ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టొచ్చు.
మరోవైపు నాగ్ అశ్విన్ కూడా మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మూడు కథల్లో మహేష్ ఏ కథని ముందుగా ఎంపిక చేసుకొంటాడన్నది సస్పెన్స్. రాజమౌళి సినిమా తరవాత వచ్చే హైప్, క్రేజ్‌ని బట్టి తదుపరి సినిమాపై ఓ అవగాహనకు రావొచ్చు. ఈ ముగ్గురిలో ఎవరితో మహేష్ జట్టు కట్టినా ఆ సినిమాపై హైప్ మామూలుగా ఉండదు.