తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అమిత్ షాపై తీవ్ర అభ్యంతరకర పదజాలం వాడారు. ఆయన తల తీసి టేబుల్ మీద పెట్టాలన్నారు. మంచి వాగ్దాటి ఉన్న నేతగా గుర్తింపు ఇలా వ్యక్తిగతంగా చంపాలన్నట్లుగా కీలక నేతలపై మాట్లాడటం విమర్శలకు కారణం అవుతోంది.
పశ్చిమ బెంగాల్లోని నదీయా జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్రమ చొరబాటు సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో అక్రమ చొరబాటు దేశ జనాభాను మార్చుతోందని అన్నారు. దీనిని గుర్తు చేసిన మహువా బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటు పెరిగిపోతోందని ..దీనికి హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నప్పటికీ చొరబాట్లు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు.
“బార్డర్లు రక్షించలేకపోతే, మరో దేశం నుంచి లక్షలాది మంది చొరబాటు చేస్తున్నారు… మా భూములు ఆక్రమిస్తున్నారు… మొదట అమిత్ షా తలను నరికి మీ టేబుల్ మీద పెట్టాలి.” అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. మహువా హింసను ప్రేరేపించేలా రెచ్చగొడుతున్నారని బీజేపీ మండిపడింది. కొంత మంది బీజేపీ నాయకులు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయంగా ఓడించాలి కానీ.. చంపేయాలని కోరుకోకూడదన్నారు.
తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నా.. మహువా స్పందించలేదు. గతంలో ఆమె పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. ఇటీవలే ఒడిషాకు చెందిన మాజీ ఎంపీని పెళ్లి చేసుకున్నారు.