కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మజ్లిస్ తహతహలాడుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో చేర్చుకోవాలని బతిమాలుతున్నారు. తమను చేర్చుకోకపోతే ఓట్లు చీలిబోయి బీజేపీ కూటమికి లాభం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. బీహార్ లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంటారు. అందుకే మజ్లిస్ అక్కడ కూడా పోటీ చేస్తోంది. గతంలోనూ పోటీ చేసింది. అప్పట్లో సాధించిన ఫలితాలు శూన్యం. అయితే ఇప్పుడు కూడా ఓవైసీ బీహార్ పై గట్టిగానే దృష్టి పెట్టారు.
ఒంటరిగా పోటీ చేయడం కన్నా కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి పోటీ చేస్తే నాలుగైదు సీట్లు అయినా దక్కించుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ కూటమిని లీడ్ చేస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ మాత్రం మజ్లిస్ ను పట్టించుకోవడంలేదు. సహజంగానే ముస్లింలు ఆర్జేడీ ఓటు బ్యాంక్ గా ఉన్నారు. వారు మజ్లిస్ వెంట నడవరు. అయినా రెండు, మూడు శాతం ఓట్లు చీలినా నష్టమే. అయినా తేజస్వి మాత్రం రెడీగా లేరు. అందుకే బీఆర్ఎస్ మజ్లిస్ యూనిట్ నాయకులు తమను కూటమిలో చేర్చుకుని సీట్లివ్వాలని కోరుతున్నారు. ఓవైసీ అనుమతి లేకుండా ఆ నేతలు ఇలా లేఖలు రాయలేరు.
మజ్లిస్ కాంగ్రెస్ కూటమిలో చేరితే దేశవ్యాప్తంగా రాజకీయాలు మారిపోతాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు మజ్లిస్ కు ఓటు వేయడం వల్ల ఆ పార్టీ నష్టపోతుంది. మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మజ్లిస్ వల్ల కాంగ్రెస్ కు ఎంతో కొంత లాభం ఉంటుంది. జరగబోయే జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరమే. అందుకే బీహార్ లో .. కాంగ్రెస్ కూటమిలోకి మజ్లిస్ చేరితే… రాజకీయాల్లో మార్పులొస్తాయని అనుకోవచ్చు.