ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలో తన మంత్రివర్గాన్ని భారీగా పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న ఈ అత్యంత కీలకమైన మార్పులు, అటు జాతీయ రాజకీయాల్లోనూ, ఇటు ప్రాంతీయ సమీకరణాల్లోనూ పెను మార్పులకు దారితీయనున్నాయి. ముఖ్యంగా కూటమి రాజకీయాలను బలోపేతం చేయడం, కొత్త మిత్రపక్షాలకు చోటు కల్పించడం, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని లే లక్ష్యంగా ఈ విస్తరణ సాగనుంది.
జాతీయ స్థాయిలో భారీ మార్పులు – కీలక శాఖలపై దృష్టి
ప్రజల ముందుకు ఓ కొత్త మంత్రివర్గాన్ని తీసుకు రావాలని మోదీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రక్షణ , ఆర్థిక వంటి అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖల్లో మార్పులు ఉండవచ్చని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్లు నిర్వహిస్తున్న శాఖల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వనున్నారు. రైల్వే, ఆరోగ్యం, ఐటీ శాఖల్లో కూడా ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేస్తున్న యువ నేత కె. అన్నామలైని రాజ్యసభకు పంపించి, ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా దక్షిణాదిపై బీజేపీ తన పట్టును మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ పలు మార్పులు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల విషయంలో ఈ మంత్రివర్గ విస్తరణ అత్యంత ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి మరో బెర్తు దక్కే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలు , రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, టీడీపీ నుంచి మరో ఎంపీకి కేంద్ర సహాయ మంత్రి లేదా స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఒత్తిడి పెట్టి తమకి పదవులు కావాలని అడిగే అవకాశం లేదు. రాష్ట్రంకోసం ఏదైనా ప్రాజెక్టు ఇస్తే చాలని.. పదవులు వద్దంటారు. బీజేపీ తీసుకోవాల్సిందే అంటే.. రాయలసీమ నుంచి ఒకర్ని ప్రతిపాదించే అవకాశం ఉంది.
అలాగే, బీజేపీ నుంచి కూడా ఏపీకి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా, బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తిగా లేరు. అందుకే మార్పు చేర్పులు ఉండవచ్చని చెబుతున్నారు.
ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు
కేవలం బీజేపీ నేతలే కాకుండా జేడీయూ , అప్నా దళ్ వంటి ఇతర మిత్రపక్షాలకు కూడా అదనపు మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్డీఏలో చేరనున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలేకు చాన్స్ రావొచ్చని చెబుతున్నారు. తమిళనాడులో AIADMK కూడా ఒకటి , రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది.
