మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మళ్లీ మనస్తాపానికి గురయ్యారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రూప్ వార్ జరుగుతోంది. బండి సంజయ్ అనుచరులు ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులుగా బరిలో నిలబెట్టారు. చాలా చోట్ల ఈటల రాజేందర్ వర్గీయులు విడిగా బీజేపీ మద్దతుదారులుగా పోటీలో నిలిచారు. ఈ పోటీలో సర్పంచులుగా బండి సంజయ్ మద్దతుదారులే గెలవడంతో..ఆయన పీఆర్వో ఈటల రాజేందర్ ను కించ పరుస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆయన సొంతంగా అభ్యర్థుల్ని నిలబెట్టారని.. బీజేపీ తరపున కాదన్నట్లుగా ఆ పోస్టులు ఉండటంతో ఈటల రాజేందర్ ఆగ్రహం చెందారు.
శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఈ ఆగ్రహాన్ని బయటకు చూాపించారు. తాను బిజెపి పార్టీ ఎంపీనని తనను కించ పరుస్తూ కొంత మంది పోస్టులు పెట్టారన్నారు. నేను కూడా కొన్ని పోస్ట్ లను చూసాను.. అవగాహన లేని, పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారని.. వీటి పైన పార్టీ తేల్చుకుంటది.. టైమ్ విల్ డిసైడ్ అని వ్యాఖ్యానించారు.
ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుందని.. సందర్భం వచ్చినప్పుడు అన్ని చెప్తానన్నారు. రెండు, మూడోవ విడత ఎన్నికల అయ్యాక జరిగిన పరిణామాలన్నీ చెప్తానన్నారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినా సుదీర్ఘ కాలంగా హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందున అక్కడ తన క్యాడర్ ను కాపాడుకుని వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకున్నారు. కానీ అక్కడ బండి సంజయ్ పూర్తిగా ఈటలకు చెక్ పెట్టి తన అనుచరులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. దీంతో ఈటల తన వారిని విడిగా పోటీ చేయిస్తున్నారు. అక్కడే సమస్య పెద్దదయింది.
