మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త మల్లారెడ్డి వారసురాలిగా ఆయన కోడలు డాక్టర్ ప్రీతీరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. మల్లారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుండి క్రమంగా విరామం తీసుకుంటున్న తరుణంలో, ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రీతీరెడ్డి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆమె సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆమె రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిస్తున్నాయి.
గ్లామర్, నాలెడ్జ్ కలగలిసిన కొత్త తరం నాయకురాలిగా ఆమె తన ఇమేజ్ను గట్టిగానే బిల్డ్ చేసుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపించినప్పటికీ, ఇటీవలి కాలంలో ప్రీతీరెడ్డి ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆమె తన ఇంటర్వ్యూలలో ప్రధాని మోదీ నాయకత్వం గురించి , దేశవ్యాప్త రాజకీయ అంశాల గురించి మాట్లాడుతున్న తీరు బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటోంది. హిందూత్వ అంశాలు, జాతీయ వాదంపై ఆమె సానుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న మల్లారెడ్డి కుటుంబం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ప్రీతీరెడ్డి సోషల్ మీడియా యాక్టివిటీ , బీజేపీ అనుకూల వైఖరి చూస్తుంటే ఆమె ఆపరేషన్ మల్కాజిగిరి కి రంగం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. తాను ఎంపీ అవ్వాలనుకుంటున్నానని పలు ఇంటర్యూల్లో కూడా చెప్పారు.
విద్యా సంస్థల నిర్వహణలో చురుగ్గా ఉంటూనే సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా యువతలోనూ, మహిళల్లోనూ ఆమె ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. రాజకీయాల్లోకి రావడంపై స్పష్టమైన క్లారిటీ ఇస్తూనే, సరైన సమయం కోసం ఆమె వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మల్లారెడ్డి రిటైర్మెంట్ ప్రకటించినా, ఆయన కోడలి రూపంలో మల్కాజిగిరి గడ్డపై మరో కొత్త రాజకీయ పోరు మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.