హనుమాన్ తర్వాత తేజసజ్జా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆ సినిమా ఇచ్చిన విజయాన్ని సరైన దిశలో తీసుకెళ్లాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు తేజ చేతిలో మిరాయ్ ఉంది. ఇది మంచి బడ్జెట్ సినిమానే. క్వాలిటీలో రాజీపడకుండా తీయడానికి అనుకున్నదానికంటే ఎక్కువే అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా చివరి దశకు వచ్చింది. కొత్త కథలను ఎంపిక చేసుకునే పనిలో ఉన్న తేజ, డిజే టిల్లు ఫేం మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని తెలిసింది.
డిజే టిల్లుతో మల్లిక్ వెలుగులోకి వచ్చాడు కానీ అంతకు ముందు తేజతోనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ ‘అద్భుతం’ అనే సినిమా తీశాడు. ఇది నేరుగా ఓటీటీలోకి వచ్చి మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు తేజ-మల్లిక్ కలిసి చేయబోతున్న సినిమా కూడా వెరైటీ కాన్సెప్ట్‌తోనే ఉండబోతోంది. అయితే ఈసారి ‘అద్భుతం’ కంటే పెద్ద స్కేల్ కథనే అనుకున్నాడట మల్లిక్. దాదాపు కథ ఓకే అయ్యింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది.