బెంగాల్ ప్రజలకు దీదీ మమతా బెనర్జీ. ఈ బిరుదు ఆమె తన పీఆర్ టీమ్‌ను పెట్టుకుని ప్రచారం చేయించుకున్నది కాదు. ప్రజలు అభిమానంతో ఇచ్చిన బిరుదు. ఎందుకంటే తన జీవిత కాలంలో చేసిన రాజకీయాలు ఆమెను బెంగాల్ ప్రజల సోదరిలా మార్చాయి. అధికారం అందిన తర్వాత కూడా ఆమె తీరు మారలేదు. అందుకే దీదీ అంటే బెంగాల్ ప్రజలు తమ ఇంట్లో మనిషి అనుకుంటారు.
యువనేతలు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో
మమతా బెనర్జీ శైలి దేశవ్యాప్తంగా ఉన్న యువ నాయకులకు, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి నాయకులకు ఒక గొప్ప పాఠం. వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించినా, ఆమె జీవనశైలిలో గానీ, ప్రజలతో ఉండే తీరులో గానీ మార్పు రాలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆమె నిరంతరం ప్రజల మనిషిగానే గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి అంటే ప్యాలెస్‌లకే పరిమితం కావాలని కాకుండా, సామాన్యుడి గడప వరకు వెళ్లాలని ఆమె నిరూపిస్తున్నారు.
సామాన్య జీవనం.. అసాధారణ పోరాటం
దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఒకవైపు యువ నేతలు చేరుతుంటే, మరోవైపు మమతా బెనర్జీ అత్యంత నిరుపేద ముఖ్యమంత్రిగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికీ ఆమె కాళీఘాట్‌లోని తన పాత ఓ పెంకుటింట్లోనే నివసిస్తూ, సాధారణ కాటన్ చీర, హవాయి చెప్పులతో సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు. సమస్య వస్తే ముఖ్యమంత్రి అన్న హోదాను కూడా పక్కన పెట్టి, సామాన్య కార్యకర్తలా రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయడం ఆమె నైజం. ప్రజల పక్షాన నిలబడటమే ఆమెకు అసలైన అలంకారం.
ఈడీ వేధింపులపై గర్జన
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఐప్యాక్ కార్యాలయాలపై , పార్టీ నాయకులపై జరుగుతున్న ఈడీ దాడుల విషయంలో ఆమె వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. దాడులు జరుగుతున్న ప్రదేశానికి స్వయంగా వెళ్లి అధికారులను ప్రశ్నించడం, తన పార్టీ వ్యూహాలను దొంగిలించే ప్రయత్నం అని నిర్భయంగా ప్రకటించడం ఆమె తెగువకు నిదర్శనం. కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు లొంగిపోవడం కంటే, ప్రజా క్షేత్రంలో పోరాడటమే మిన్న అని ఆమె నమ్ముతారు. ఇటువంటి పోరాట పటిమ ఉన్న నేతలకే ప్రజల్లో దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రజా సమస్యల పరిష్కారంలో గానీ, పార్టీని కాపాడుకోవడంలో గానీ ఆమె ప్రదర్శించే పట్టుదల అసాధారణం. ప్యాలెస్‌లలో కూర్చుని సోషల్ మీడియా ద్వారా రాజకీయం చేయడం కంటే, మండుటెండలో ప్రజల మధ్య తిరగడం, వారి కష్టాల్లో భాగం పంచుకోవడం ఎలాగో మమతా బెనర్జీని చూసి నేర్చుకోవచ్చు.
