నల్లధనంపై పోరులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్దనోట్లను రద్దు చేయగానే మొదటగా ప్రజలపై చూపగల ప్రభావాన్ని అంచనావేసి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ పంధా చేపట్టగలిగిన నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమే. ఆమె ఆందోళనతో మిగిలిన పార్టీలు అన్ని కూడా ఆమెతో స్వరం కలుపక తప్పలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జాతీయ నాయకత్వం కోసమై ఎదగడం కోసం ఎత్తుగడలను అమలుచేయడం ప్రారంభించారు.
నోట్ల రద్దును `ఆర్ధిక అత్యవసర పరిస్థితి’ అంటూ ముందుగా ఆమెనే తీవ్రంగా విమర్శించారు. మిగిలిన పార్టీలు ఏమి చేయాలో ఆలోచించుకోనే లోపుగానే రాష్ట్రపతి భవన్ కు ప్రదర్శన జరపడం, ఢిల్లీ లో నిరసనసభ జరపటం వంటివి చక చక చేసేసారు. ఈ సందర్భగా వ్యూహాత్మక కారణాలతో ఆమె వెంట కొద్దీ పార్టీల నాయకులూ మాత్రమే వచ్చినా, పార్లమెంట్ లో అన్ని పార్టీలు కలసి ఉమ్మడి వ్యూహం రూపొందించే విధంగా ఆమె చేయగలిగారని మరువలేము. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధానమంత్రి చర్యను సమర్ధిస్తున్నా ఆమె పార్టీ నాయకులూ పార్లమెంట్ లో నిరసన స్వర వినిపించక తప్పని పరిస్థితులను ఆమె కలిగించారు.
ఉపఎన్నికల ఫలితాలలో ఆమె పార్టీ అభ్యర్థులు అత్యధిక ఓట్లతో గెలుపొందడం, ప్రతిపక్షాలకు డిపాజిట్ లు వచ్చే పరిస్థితులు కూడా లేకపోవడంతో రాష్ట్రంలో తన పరిస్థితి సుస్థిరంగా ఉన్నదని నిర్ధారించుకున్న అనంతరం ఆమె ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ద్రుష్టి సారించారు. ఢిల్లీ తరువాత లక్నో, పాట్నా లలో సహితం బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. ” ఎన్నికలు జరిగే ప్రతి చోటకు వస్తా… నరేంద్ర మోడీ కి ఎవ్వరో ఓటు వేయకుండా చూస్తా” అంటూ ఆమె బహిరంగంగా ప్రధానమంత్రిని సవాల్ చేశారు.
నేరుగా ప్రజలతో సంబంధాలు ఏర్పర్చుకోవడంలో దేశంలో ఆమెకు మించిన రాజకీయ నాయకులు మరెవ్వరూ లేరని చెప్పవచ్చు. ఆమెను `వీధి రాజకీయ నాయకురాలు’ అని కూడా అంటారు. అందుకనే డార్జీలింగ్ వెడితే నేపాలీ భాషలో, మిడ్నపూర్ వెడితే సంథాల్ భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో హిందీలో మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
మొదటగా హిందీ లో ట్వీట్ లు ఇవ్వడం ప్రారంభించారు. తాను ఇంగ్లీష్ లో ఇచ్చే ట్వీట్ లకు హిందీ అనువాదం ఏర్పాటు చేసుకున్నారు. ఇక బెంగాలీ-హిందీ నిఘంటువు ఒక దానిని కొనుక్కున్నారు. హిందీ టీచర్ ఒకరిని చూడమని పార్టీ వారిని కోరారు. 2013లో ప్రచురించిన ఆమె ఆత్మకథ హిందీ ప్రతి “మేరా సంఘర్శపూర్ణ యాత్ర” ను తిరిగి ముద్రించాలని ఆమె పార్టీ వారు భావిస్తున్నారు.
1984లో పార్లమెంట్ సభ్యురాలిగా సుదీర్ఘకాలం ఢిల్లీ లో ఉన్న, కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా ఉన్నా 2011 నుండి సొంతరాష్ట్రానికే పరిమితం అవుతున్నారు. తాను మాట్లాడే హిందీ కొంచెం మొరటుగా ఉంటుందని, దానిని మెరుగు పరచు కోవాలని భావిస్తున్నారు.