పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ భారీ హామీలను ప్రకటించారు. కాళీఘాట్‌లోని తన నివాసం నుండి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలు, యువత , గ్రామీణ ప్రజలను ఆకట్టుకునేలా 10 ప్రధాన వాగ్దానాలను పొందుపరిచారు.
మహిళలకు ప్రతి నెలా డబ్బులు
మమతా బెనర్జీ ప్రభుత్వం తన గత విజయాల్లో కీలక పాత్ర పోషించిన లక్ష్మీర్ భండార్ పథకాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మహిళలకు అందుతున్న నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ. 500 పెంచుతూ, సాధారణ వర్గాలకు రూ. 1,500 , ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ. 1,700 అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం జీవితాంతం కొనసాగుతుందని భరోసా ఇవ్వడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని టీఎంసీ భావిస్తోంది. అలాగే వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇంటి వద్దకే వైద్యం
పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లే క్రమంలో దువారే సర్కార్ అనే కార్యక్రమంలో తరహాలోనే దువారే చికిత్స అంటే ఇంటి వద్దకే వైద్యం అనే వినూత్న పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చారు. ప్రతి బూత్ స్థాయిలో హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం దీని లక్ష్యం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం వేల సంఖ్యలో పాఠశాలలను ఈ-లెర్నింగ్ సౌకర్యాలతో ఆధునీకరిస్తామని, స్కాలర్షిప్ నిధులను క్రమబద్ధీకరిస్తామని మమత ప్రకటించారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య, విద్యా ప్రమాణాలను పెంచే వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది. యువతను ఆకట్టుకోవడానికి యువ శక్తి పథకాన్ని హైలైట్ చేశారు. ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, పోర్టులు , గ్లోబల్ ట్రేడ్ సెంటర్‌ను నిర్మిస్తామని వాగ్దానం చేశారు. అంతేకాకుండా, ప్రతి ఇంటికీ నల్లా నీరు, అందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని, వ్యవసాయ రంగం కోసం రూ. 30,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తామని వెల్లడించారు.
బీజేపీ పూచి – వరుస హామీలు
మేనిఫెస్టో విడుదల సందర్భంగా మమత కేవలం హామీలకే పరిమితం కాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్ సంస్కృతి తెలియని అధికారులను ఇక్కడ నియమించి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులు చేసినా బెంగాల్ మళ్లీ గెలుస్తుంది అనే నినాదంతో ఆమె కేడర్‌లో ఉత్సాహం నింపారు. మమతా బెనర్జీ మేనిఫెస్టో సంక్షేమ పథకాలు , ప్రాంతీయ సెంటిమెంట్ల కలబోతగా ఉంది. బెంగాల్ ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలో మమతా బెనర్జీకి తెలుసన్న కామెంట్లు ఈ మేనిఫెస్టో తర్వాత వినిపిస్తున్నాయి.


