పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కోల్‌కతాలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామాకు నిరాకరించడం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తోంది. మమతా బెనర్జీ ఫలితాలను అంగీకరించేందుకు నిరాకరిస్తున్నారు. మేము ఓడిపోలేదు, ప్రజా తీర్పును బీజేపీ లూటీ చేసింది అని ఆరోపిస్తూ ఆమె తన పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. స్వయంగా తన భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో ఓడిపోయినప్పటికీ, రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా పత్రాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె మొండికేయడం బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
రాష్ట్రంలో నెలకొన్న ఈ వింత పరిస్థితులపై గవర్నర్ ఆర్.ఎన్. రవి రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం, ప్రస్తుత అసెంబ్లీ గడువు బుధవారం ) అర్ధరాత్రితో ముగియనుంది. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే, గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఆమెను పదవి నుండి తప్పించే అవకాశం ఉంది. మెజారిటీ ఉన్న పార్టీ ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ బాధ్యత కాబట్టి, ఆయన నేరుగా బీజేపీ శాసనసభాపక్ష నేతను పిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు.
బీజేపీ తన వ్యూహాలను వేగవంతం చేస్తోంది. మే 9వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం కోల్‌కతాకు రానున్నారు. ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే, ఆమెను బలవంతంగా తొలగించి అయినా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ సిద్ధమవుతున్నారు.
