రాజకీయాన్ని రాజకీయం లాగే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలి తప్ప, ప్రత్యర్థి పక్షాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని, రాష్ట్రంలో విపక్షమనేదే లేకుండా చేయాలని ఏ పాలకుడైనా భావిస్తే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనే చారిత్రాత్మక సత్యాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం, శారీరక దాడులకు దిగడం, చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థలనే తమకు అనుకూలంగా మార్చుకుని వన్ మ్యాన్ షో నడపాలని చూడటం ఎంతటి ప్రమాదకరమో బెంగాల్ ఫలితాలు కళ్లకు కట్టాయి.
భయం ఎప్పుడూ ‘సేలబుల్’ కాదు.. బెంగాల్ వీధుల్లో రుజువైన సత్యం!
పాలకులలో చాలా మంది తాము సృష్టించే భయంతోనే జనాలను లొంగదీసుకోవచ్చని, బెదిరించి ఓట్లు వేయించుకోవచ్చని భ్రమపడుతుంటారు. ముఖ్యంగా 2021 ఎన్నికల అనంతరం బెంగాల్ వ్యాప్తంగా సాగిన హింస, విపక్ష కార్యకర్తలపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే, భయం అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ అమ్ముడుపోయే సరుకు కాదు. అది తాత్కాలికంగా ప్రజలను నోరు నొక్కేలా చేయగలదేమో కానీ, లోలోపల పెరిగే అసంతృప్తిని, కసిని ఆపలేదు. ఓటు అనే ఆయుధం సామాన్యుడి చేతికి దొరికిన రోజున ఆ భయపు కోటలు ఎలా బద్దలవుతాయో మమతా బెనర్జీ ఘోర పరాజయం నిరూపించింది. భయాందోళనల నీడలో మగ్గిన బెంగాలీ సమాజం, సమయం రాగానే నిశ్శబ్ద విప్లవంతో తృణమూల్ కోటలను బద్దలు కొట్టింది. అంతకు ముందు ఏపీలోనూ ఇదే జరిగింది.
ఓడిపోగానే ఒంటరితనం.. దండం పెట్టి వెళ్తున్న దళపతులు!
అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ భజన చేసే కోటరీ, సొంత లాభాల కోసం బాస్ నిర్ణయాలను గుడ్డిగా సమర్థించే అనుచరులు.. అధికారం కోల్పోగానే ఎలా ప్లేటు ఫిరాయిస్తారో మమతా బెనర్జీ ప్రస్తుత దీనస్థితిని చూసి నేటి తరం రాజకీయ నేతలు నేర్చుకోవాలి. బెంగాల్లో టీఎంసీ ఓడిపోవడమే ఆలస్యం.. ఇన్నాళ్లూ మమతను ఆకాశానికెత్తిన అత్యంత సన్నిహితులు, సీనియర్ మంత్రులు, ఎంపీలు సైతం దండం పెట్టి పక్కకు తప్పుకుంటున్నారు. దశాబ్ద కాలంగా తాము చేసిన అవినీతి, ‘కట్ మనీ’ వసూళ్ల పాపాలు ఎక్కడ చుట్టుకుంటాయో, కేంద్ర దర్యాప్తు సంస్థల వేడి ఎక్కడ తగులుతుందోనని భయపడి, కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం తమ జోలికి రాకుండా ఉంటే చాలని చాలా మంది సీనియర్లు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
అభిషేక్ తప్ప ఎవరూ లేరు.. ప్యాలెస్ రాజకీయాల ముగింపు!
ఒకప్పుడు దేశ రాజకీయాలనే శాసిస్తానని విర్రవీగిన మమతా బెనర్జీ చుట్టూ.. నేడు ఆమె మేనల్లుడు, వారసుడు అభిషేక్ బెనర్జీ తప్ప మరెవరూ నమ్మకమైన వారు కనిపించడం లేదు. ప్రస్తుతం బెంగాల్ వీధుల్లో టీఎంసీ నేతలపై ప్రజలు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేస్తుంటే.. కాపాడుకోవాల్సిన కేడర్ కూడా రోడ్లపైకి రాని పరిస్థితి ఏర్పడింది. కేవలం కుటుంబ సభ్యులను, సొంత కోటరీని నమ్ముకుని.. సామాన్య ప్రజలను, ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తే ఏ నాయకుడైనా రాజకీయంగా ఎంతటి ఏకాకి అవుతారో చెప్పడానికి ప్రస్తుత తాడేపల్లి కోట పరిణామాలు, బెంగాల్ ప్యాలెస్ రాజకీయాలే సజీవ సాక్ష్యాలు. రాజకీయాలు ఎలా చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. అధికారం ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా చేయకూడదో తెలుసుకోవడానికి మమతా బెనర్జీ ప్రస్తుత ప్రస్థానమే దేశంలోని మిగతా నాయకులకు ఒక పెద్ద లైవ్ గైడ్.


