రీజనల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ సినిమా వసూళ్లలో కొంత గందరగోళం ఉందన్న మాట వినిపిస్తోంది. ఫేక్ కలక్షన్లంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. వసూళ్ల మాట పక్కన పెడితే, చాలా కాలం తరవాత మెగాస్టార్ కు దక్కిన మెగా హిట్ ఇది. చిరు రీ ఎంట్రీలో ఖైదీ నెం.150, వాల్తేరు వీరయ్య మాత్రమే కమర్షియల్ హిట్స్. మధ్యలో చాలా ఫ్లాపులు ఎదురయ్యాయి. చాలా ఆశలు పెట్టుకొని, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘సైరా’ నష్టాలు మూట గట్టుకొంది. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ డిజాస్టర్లు. ఇక.. ‘ఆచార్య’ సంగతి చెప్పాల్సిన పని లేదు. మెగా ఇమేజ్‌ని డామేజ్‌కి గురి చేసిన సినిమా ఇది. చిరు సినిమాలకు టాక్ తో పని లేకుండా ఓపెనింగ్స్ వచ్చి పడిపోతుంటాయి. కానీ ఈమధ్య కాలంలో అలాంటి మ్యాజిక్ జరగలేదు. నెగిటీవ్ టాక్ వస్తే… చిరు సినిమాకు కూడా టికెట్లు తెగవన్న విషయం అర్థమైంది. మెగా ఫ్యాన్స్ చాలా ఆందోళనకు గురయ్యారు. 150 సినిమాల చరిత్ర ఉన్న చిరుకి మళ్లీ ఓ మెగా హిట్ అవసరం అయ్యింది. అది… `మన శంకర వర ప్రసాద్ గారు`తో దక్కింది.
ఇది ఆషామాషీ హిట్ కాదు. ఇండస్ట్రీ రికార్డు లెక్కల్ని సవరించిన హిట్ ఇది. సంక్రాంతి బరిలో, టఫ్ కాంపిటీషన్ మధ్య నిలిచి.. గెలిచింది. సినిమాలకు మానేసిన ఒకప్పటి చిరంజీవి ఫ్యాన్స్ ని సైతం.. మళ్లీ థియేటర్లకు రప్పించింది. చిరులోని క్లాస్‌నీ, మాస్‌నీ సమానంగా చూపించిన సినిమా ఇది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. పైగా కొణిదెల సుస్మిత ఈ చిత్రానికి ఒకానొక నిర్మాత. గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసిన తరవాత.. ఆ సంస్థ నిర్మాణంలో ఓ పెద్ద సినిమా తెరకెక్కడం, అదికూడా ఈ స్థాయిలో విజయం సాధించడం.. నిర్మాతగా సుస్మిత కు కూడా పెద్ద బూస్టప్.
అన్నింటికంటే ముఖ్యంగా సీనియర్ హీరోలు ఫామ్ లోకి రావడం చాలా అవసరం. వాళ్లు సరైన హిట్ కొడితే… ఆ సౌండ్ ఎలా ఉంటుందో.. చూపించిన సినిమా ఇది. ఇలా ఎన్ని రకాలుగా చూసినా.. ఈ సినిమా విజయం ప్రత్యేకం. రాబోయే ‘విశ్వంభర’ సినిమాకూ ఈ విజయం కావాల్సినంత ఊతం అందించనుంది.