ఈ సంక్రాంతికి శంకర వర ప్రసాద్ లా వినోదాలు పంచడానికి సిద్ధమయ్యారు చిరంజీవి. ఆయన్నుంచి ‘మన శంకర వర ప్రసాద్ గారూ’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో.. దర్శకుడిగా దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార కథానాయిక. వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 12న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్ అంతా కలర్ ఫుల్ గా ఉంది. చిరుని వీలైనంత క్లాస్ గా, ఫ్యామిలీ మెన్ గా చూపించడానికి ప్రయత్నించాడు అనిల్ రావిపూడి. చిరు స్టైలింగ్, కాస్ట్యూమ్స్, గ్రేస్… అన్నీ సూపర్ కూల్ గా ఉన్నాయి. ముఖ్యంగా శశిరేఖ (నయనతార)తో ట్రాక్ ఈ సినిమాకి మేజర్ హైలెట్ అవ్వబోతోందన్న సంగతి… ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘కొంచెం లోపలకు వచ్చి తిట్టవా… ప్లీజ్’, ‘నా వాట్సప్ నెంబర్ అన్ బ్లాక్ చేయవా’ అంటూ చిరు బతిమాలుకొంటున్నప్పుడు టైమింగ్.. అదిరిపోయింది. ఇలాంటి టైమింగే సినిమా అంతా ఉంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా మరింత ఎట్రాక్ట్ చేయడం ఖాయం. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. చివర్లో.. వెంకీ ఎంట్రీ కూడా బాగుంది. ‘చూస్తుంటే ఫ్యామిలీ మెన్ లా ఉన్నావ్…. ఈ మాస్ ఎంట్రీ ఏమిటి’ అని చిరు అడగడం.. దానికి వెంకీ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పడం బాగున్నాయి.
సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు పెద్దపీట వేస్తుంటారు ప్రేక్షకులు. ఆ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే కథలో కాన్ఫ్లిక్ట్ ఏమిటన్నది ట్రైలర్ లో రివీల్ చేయలేదు. బలమైన విలన్ కూడా కనిపించలేదు. అవి రెండూ పక్కన పెడితే – ట్రైలర్ మాత్రం బాగుంది.
