మాంచెస్టర్ టెస్ట్‌లో కనీవినిఎరుగని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అసలు సిసలైన టెస్ట్ రుచిని ఇంగ్లాండ్‌కు చూపించింది భారత క్రికెట్ జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడింది భారత్. ఇంగ్లాండ్ 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ లక్ష్యాన్ని కరిగించడానికి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 0 పరుగులకే ఇద్దరు బ్యాట్స్‌మెన్ డెక్ అవుట్ అయ్యారు. నాలుగో రోజుకే టీమిండియా కుప్పకూలిపోవడం ఖాయం అని అందరూ భావించారు. కానీ గిల్, రాహుల్ బలమైన గోడలాగా నిలబడిపోయారు. చాలా ఓపికగా క్రీజ్‌లో అతుక్కుపోయారు. మరో వికెట్టు పడకుండా నాలుగో రోజు మొత్తం ఆడారు.
ఇక ఐదో రోజు డ్రా కోసమే ఆడాల్సిన పరిస్థితి. డ్రా అయితే చాలు అనుకున్న పరిస్థితి అనూహ్యంగా ఒక గమ్మత్తయిన మలుపు తిరిగింది. ఐదో రోజు ఆట ప్రారంభించిన వెంటనే గిల్, రాహుల్ కొద్ది సమయంలోనే పెవిలియన్‌కి చేరారు. ఈ దశలో ఇంగ్లాండ్ ఉత్సాహం మామూలుగా లేదు. మరో రెండు వికెట్లు తీస్తే భారత్ టెయిలెండర్లని పని పట్టి వచ్చు అన్న ధీమా వారిలో కనిపించింది.
ఈ దశలో బ్యాటింగ్‌లోకి వచ్చిన జడేజా, సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. మరో వికెట్ కోల్పోకుండా క్రీజ్‌లో పాతుకుపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లను మార్చిమార్చి బౌలింగ్ చేసింది. ఫీల్డింగ్ సెటప్‌ని ప్రతి 5 ఓవర్లకీ మార్పు చేసింది. ఎన్ని ఎత్తులు వేసినా అవన్నీ కూడా జడేజా, సుందర్ తిప్పికొట్టారు. డ్రా చేసుకుంటే చాలు అనుకునే మ్యాచ్ కాస్తా చివర్లో భారత అభిమానులు కాలర్ ఎగరేసుకునే ఒక ఘట్టానికి చేరింది.
చివరి 13 ఓవర్లలో ఉండగా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ జడేజా దగ్గరకి వచ్చి డ్రా చేసుకుందాం అని అడిగాడు. దానికి జడేజా “నా చేతుల్లో లేదు” అని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో గిల్ అండ్ కో నవ్వులు మామూలుగా లేవు. ఈ సీన్ చూస్తున్న సగటు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోలేడు. అప్పటికి జడేజా 90 పరుగుల్లో ఉన్నాడు. అలాగే సుందర్ కూడా సెంచరీకి దగ్గరలోనే ఉన్నాడు.
ఒక దశలో ఇంగ్లాండ్ చాలా ఫ్రస్ట్రేషన్‌కి గురైంది. బ్రూక్‌కి బౌలింగ్ ఇచ్చి ఫుల్‌టాస్‌లు వేయించారు. ఈ దశలో జడేజా సెంచరీ కొట్టాడు. సెంచరీ కొట్టిన తర్వాత అయినా డ్రా చేస్తారేమోనని మళ్లీ జడేజా దగ్గరికి వెళ్లారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. జడేజా మళ్లీ పట్టించుకోలేదు. ఇక మిగిలింది సుందర్ సెంచరీ. సుందర్ కూడా సెంచరీ పూర్తి చేశాడు.
విజయం దక్కలేదు, కనీసం సెంచరీలైనా ఆపుదాం అనుకునే ఇంగ్లాండ్ పాచికలు పారలేదు. మన ఆటగాళ్లు ఇద్దరూ కూడా సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ఈగోని ఒలిచేశారు. ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయినప్పటికీ, ఇండియా గెలిచినట్టే లెక్క. 311 పరుగుల ఆధిక్యాన్ని కరిగించి, రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ 100 పరుగులకు పైగా ఆధిక్యాన్ని సాధించి, ఇద్దరు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయడం అంటే.. ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టడమే. ఈ డ్రా ఇండియన్ ఫ్యాన్స్‌కు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది.