మొన్నే ‘సింగిల్’లో ‘శివయ్యా..’ అంటూ అరిచాడు శ్రీవిష్ణు. దాంతో మంచు విష్ణుకి కోపం వచ్చేసింది. ‘నా సినిమాతో వేళాకోళం ఏమిటి’ అంటూ ఛాంబర్‌కి వెళ్లాడు. దాంతో శ్రీవిష్ణు తగ్గాడు. ఆ డైలాగ్ ని కట్ చేశాడు. సారీ కూడా చెప్పాడు. దాంతో వివాదం ముదరకుండానే ముగిసిపోయింది. ఇప్పుడు మంచు మనోజ్ అందుకొన్నాడు. ‘భైరవం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో `శివయ్యా అంటే శివుడు రాడు` అంటూ ప్రత్యక్షంగానే విష్ణుపై సెరైట్ వేశాడు. ‘భైరవం’లో కూడా విష్ణుని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు… ఇటీవల ఓ టీవీ షోకి ప్రమోషన్ కోసం హాజరయ్యాడు మనోజ్. అక్కడ కూడా పోగ్రాం మధ్యలో ‘శివయ్యా…’ అంటూ గట్టిగా అరిచాడట మనోజ్. ఆ ఎపిసోడ్ ఇంకా టెలీకాస్ట్ అవ్వలేదు. ఆ డైలాగ్ ఉంచాలా, లేదా? అనే డైలామాలో ఉంది టీవీ యాజమాన్యం. ఉంచితే – వైరల్ అవుతుంది. కాకపోతే… మోహన్ బాబు తో అనవసరమైన తలనొప్పి. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. మనోజ్ దాన్ని.. ఇంకా ముదరబెట్టేలా ఉన్నాడు. ‘శివయ్యా’ డైలాగ్‌లో శ్రీవిష్ణుని వెనక్కి తగ్గేలా చేసిన మంచు విష్ణు ఇప్పుడు మనోజ్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి.
మనోజ్ స్పీచ్‌లో ఎమోషన్ కనిపించింది. తనని కుటుంబం దూరం చేస్తోందని, అయినా తానింకా మోహన్ బాబు అబ్బాయినేనని భావోద్వేగ భరితంగా చెప్పుకొచ్చాడు మనోజ్. స్క్రీన్ పై తన ఏవీ వస్తున్నప్పుడు కూడా ఎమోషన్ అయిపోవడం చాలామందిని కదిలించింది. విష్ణు కంటే మనోజ్ చాలా టాలెంటెడ్ అని చిత్రసీమలో చాలామంది గట్టిగా నమ్ముతారు. అందరితోనూ ఎలాంటి ఈగోలూ లేకుండా కలిసిపోతాడన్న పేరుంది. చాలా హుషారైన మనిషి కూడా. అలాంటిది ఇప్పుడు తను బాగా నలిగిపోతున్నాడు. చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి `భైరవం`తో తన కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకొంటుందో చూడాలి.