దేశం, దేశభక్తి… సినిమాకు సంబంధించినంత వరకూ తిరుగులేని కమర్షియల్ అంశాలు. ఆ కథల్ని స్వరాజ్య సంగ్రామంతో ముడిపడితే… మరింత బోనస్. ఈ తరహా కథలు పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాలు సాధించాయి. మంచు మనోజ్ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’ కూడా ఇలాంటి దేశ భక్తి చిత్రమే. హనుమా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భరత్ మోటుకూరి, వెంకట రెడ్డి నల్లగంగుల నిర్మాతలు. ఈ రోజు టీజర్ గ్లింప్స్ విడుదల చేశారు. `డేవిడ్ రెడ్డి` పాత్రనీ, తన ప్రపంచాన్నీ, కథా నేపథ్యాన్నీ ఈ గ్లింప్స్ లో పరిచయం చేశారు.
అతను బ్రిటీషర్లకూ శత్రువే… ఇండియన్స్ కీ శత్రువే…
పాతిక కోట్లమంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది….
మరిగే రక్తం నిప్పులు కక్కింది… ఆ గుండె వేగానికి నేల కదిలింది…
మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటీషర్లకు.. అతను వార్ డాగ్ అయ్యాడు…. లాంటి డైలాగులు వాయిస్ ఓవర్ లో వినిపించాయి.
చివర్లో ‘ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై…. ఏ డేవిడ్ రెడ్డి ఇండియా హై’ అంటూ మనోజ్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్ తో గ్లింప్స్ లక్ష్యం పరిపూర్ణమైంది. నేపథ్య సంగీతం, విజువల్స్ మరింత ఇంపాక్ట్ కలిగించాయి. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా గంభీరంగా వుంది. కమ్ బ్యాక్ తరవాత మనోజ్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఇది. విలన్ గా చేసిన మిరాయ్ మంచి విజయాన్ని అందించింది. మరి హీరోగా తన కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకొంటుందో చూడాలి.


