మూడున్నరేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి 98. 60 శాతం హామీలు నెరవేర్చానని చెబుతూంటారు. ఆయన మంత్రులూ చెబుతూంటారు. ఈ లెక్కందో విచిత్రంగా ఉన్నా సరే.. నమ్మకంగా ఉంటుందని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన సమీప బంధువు… మంచు విష్ణు కూడా అదే పని చేస్తున్నారు. మా ఎన్నికల్లో గెలవడానికి చాలా హామీలిచ్చిన ఆయన ఏడాది దాటిపోయిన తర్వాత తాను ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేశానని చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా ధర్నాలు చేస్తే.. వారిని మా సభ్యత్వం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తానని హెచ్చరికలు చేస్తున్నారు.
అదేదో ఒక్క సారి అధ్యక్షుడయినంత మాత్రాన. సభ్యుల్ని ఇష్టారాజ్యంగా బహిష్కరించడం తన చేతుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి మంచు విష్ణు ప్రధాన హామీ.. మా కు సొంత భవనం నిర్మించడం. ఎన్నికలకు ముందు చాలా వీడియోలు చేసి.ప్రైమ్ ఏరియాలో భూముల్ని కూడా కొని పెట్టానని.. వాటిలో ఒకటి సెలక్ట్ చేసుకోవడమేనని… ఆరు నెలల్లో కట్టేయడమే మిగిలిందని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే.. ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా మందుకు పడలేదు.
జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దు , మద్యనిషేధం హామీల్లాగా.. దీన్ని కూడా …ఇతరలు సహకరించకపోవడం వల్ల చేయలేకపోయామని చెప్పి విష్ణు సర్దుకునేలాగానే ఉంది. లేకపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కడతానని చెప్పి రంగంలోకి దిగుతారేమో. మొత్తానికి జగన్ నుంచి మంచు విష్ణు.. మంచిమంచి కట్టుబాట్లనే నేర్చుకున్నారు.