ఏపీలో వర్గీకరణ సెగలు రేపుతున్న మందకృష్ణ..!

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మందకృష్ణకు తెలంగాణలో రాజకీయాలు పెద్దగా ఉత్సాహం ఇవ్వడం లేదు కానీ.. ఏపీలో మాత్రం.. ఆయనకు కావాల్సినంత పని దొరుకుతోంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను.. ఆయన వర్గీకరణ పేరుతో.. ఇరకాటంలో పెడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం.. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న ఆయన… అధికారంలో ఉన్న ప్రభుత్వాలను… వర్గీకరణకు అనుకూలంగా నిర్మయం తీసుకోవాలని.. ఒత్తిడి చేస్తూంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు.. వర్గీకరించాలని లేఖ కూడా రాశారు. కానీ ఇప్పుడు ఆయన తన స్టాండ్ మార్చుకున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. దాంతో.. మంద కృష్ణ ఒక్క సారిగా ఏపీలో … తెర మీదకు వచ్చేశారు.

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పుడు.. రోజువారీగా విమర్శలు, ప్రతి విమర్శలకు కారణం ‌‌అవుతోంది. మంద కృష్ణ ఎలాంటి ఉద్యమ ప్రయత్నాలు చేసినా.. పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో ఆయన రోజువారీగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. జగన్ తన తండ్రి వైఎస్ ఆశయాలను నీరుగారుస్తున్నారని మందకృష్ణ అంటున్నారు. ఎన్నికల ముందు వర్గీకరణకు మద్దతిస్తానని మాదిగలకు ఇచ్చిన హామీ గుర్తు చేసుకోవాలని అంటున్నారు. బైబిల్ సాక్షిగా జగన్ వర్గీకరణకు అనుకూలంగా హామీ ఇచ్చారని నేడు అధికారంలోకి వచ్చి మాట మారుస్తున్నారని మండిపడుతున్నారు. మాట తప్పం మడమ తిప్పం అంటే ఇదేనా అని మందకృష్ణ జగన్ ను ప్రశ్నిస్తున్నారు. చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకోడంతో.. మరింత పట్టుదలగా ఉన్నారు.

అదే సమయంలో.. వైసీపీకి చెందిన ఎస్సీ నేతలు, వివిధ మాల సంఘాల ప్రతినిధులు.. మందకృష్ణకు వ్యతిరేకంగా.. వైసీపీకి మద్దతుగా రంగంలోకి వస్తున్నారు. ఏపీలో బీజేపీ కోవర్టుగా మంద కృష్ణ మాదిగ పర్యటిస్తున్నాడని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న నవ్యాంధ్ర రాజధాని లో మంద కృష్ణ మాల – మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మందకృష్ణ.. ఏపీలో తొలి రాజకీయ పోరాటానికి నాయకత్వం వహించడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలు.. చంద్రబాబు పెట్టిన చిచ్చు అని చెబుతున్నప్పటికీ.. అది అవుట్ డేటెడ్ ఆరోపణగా మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com