ఆధునిక రాజకీయాల్లో గెలుపు కంటే ప్రజల గుండెల్లో చోటు సంపాదించడం కష్టమైన పని. కానీ, నారా లోకేష్ మంగళగిరి వేదికగా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. 2019 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ఆయన నిర్మించుకున్న కార్యకర్తల, సహాయకుల యంత్రాంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక కేస్ స్టడీగా మారింది. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ లోకేష్ నేరుగా చేరువయ్యేలా ఒక పకడ్బందీ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా మంగళగిరి అంటే కేవలం ఒక నియోజకవర్గం కాదు, ఒక మోడల్ డెవలప్మెంట్ హబ్ అనే గుర్తింపు వస్తోంది.
కష్టంలో అండ.. సుఖంలో భాగస్వామి
లోకేష్ పనితీరులో అత్యంత కీలకమైన అంశం ఆయన చూపే మానవీయ కోణం. నియోజకవర్గంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా లోకేష్ నుంచి శుభాకాంక్షలు అందడమే కాకుండా, తనవంతుగా నేనున్నానని ’ భరోసా ఇచ్చే కానుకలు చేరుతున్నాయి. ఇది కేవలం ఎన్నికల తంతు కాదు, ఐదేళ్లుగా నిర్విరామంగా సాగుతున్న ప్రక్రియ. అలాగే, ఏదైనా కుటుంబంలో విషాదం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు ఆర్థికంగా, మానసికగా అండగా నిలవడం లోకేష్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసింది. వ్యక్తిగత సమస్యల నుంచి సామాజిక ఇబ్బందుల వరకు ఏ ఫిర్యాదు వచ్చినా, దానిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన గ్రీవెన్స్ టీమ్’ పనిచేస్తుండటం ఆయన నిబద్ధతకు నిదర్శనం.
ప్రజా దర్బార్ – సమస్యలకు తక్షణ పరిష్కారం
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ వినూత్న ప్రజాస్వామ్య వేదికగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అర్జీలను స్వీకరిస్తూనే, మంగళగిరి వాసులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 75 శాతానికి పైగా పరిష్కార రేటుతో సాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా వేలాది మందికి మేలు జరుగుతోంది. విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి, కేవలం రాజకీయనాయకుడిలా కాకుండా ఒక బాధ్యతాయుతమైన కుటుంబ పెద్ద లా వ్యవహరిస్తున్నారు.
అభివృద్ధి పథంలో మంగళగిరి
ఒక గేట్‌వే మంగళగిరిని అమరావతికి ముఖద్వారంగా భావించే లోకేష్, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఆధునిక ఆసుపత్రులు, కమ్యూనిటీ భవనాలు, మోడల్ లైబ్రరీల వంటి ప్రాజెక్టులతో నియోజకవర్గ రూపురేఖలను మారుస్తున్నారు. మన ఇల్లు – మన లోకేష్ వంటి కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తూ లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. రాజకీయం అంటే కేవలం విమర్శలు కాదని, ప్రజల కళ్లలో ఆనందం చూడటమేనని నిరూపిస్తూ.. లోకేష్ తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు.


