‘థగ్ లైఫ్’ సినిమా కమల్ హాసన్, మణిరత్నం ఇద్దరికీ పెద్ద షాక్. 38 ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి చేసిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. మణిరత్నంని విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్‌ను కూడా నిరాశపరిచింది. తాజాగా ఈ సినిమా ఫలితం పై మణిరత్నం పెదవి విప్పారు. సారీ చెప్పారు. అయితే అందులో కూడా ఓ మెలిక ఉంది.
”మేము మళ్లీ ‘నాయకన్’లాంటి సినిమా చేస్తామనుకుని ఎదురుచూసినవారికి క్షమాపణ చెబుతున్నాను” అని ముక్తాయించారు మణిరత్నం. అంతేకాదు ”మేము గతాన్ని తిరగరాయాలనుకోలేదు. మేము కొత్తదేదో అన్వేషించాలని ప్రయత్నించాం. ప్రేక్షకులు మేము ఇచ్చింది కంటే పూర్తిగా భిన్నమైనదేదో ఊహించారు” అని చెప్పుకొచ్చారు.
బేసిక్‌గా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోతే ఫిల్మ్ మేకర్స్ నుంచి ఇలాంటి సమాధానాలే వస్తుంటాయి. ‘మేము ఒకటి అనుకున్నాం, ప్రేక్షకులు ఇంకేదో ఆశించి వచ్చారు. అందుకే ఈ సినిమా వర్క్ కాలేదు’ అనేది కామన్ ఆన్సర్. మణిరత్నం కూడా దాదాపుగా ఇదే సమాధానం చెప్పారు.
అయితే సినిమా ప్రమోషన్ సమయంలో ఇలాంటి విషయాల్లో క్లారిటీగా ఉండాలి. నాయకుడితో ‘థగ్ లైఫ్’కి సంబంధం లేదని, ఇది పూర్తిగా కొత్త సినిమా అని ఒకటికి రెండుసార్లు చెప్పాల్సింది. అన్నింటికన్నా ముఖ్యంగా కమల్ హాసన్ పాత్రకి ‘శక్తివేల్’ అని పేరు పెట్టకపోవాల్సింది.
నాయకుడు – థగ్ లైఫ్… ఈ రెండు ప్రపంచాలను కొంచెం లోతుగా పరిశీలిస్తే బోలెడు మెటాఫర్స్ మ్యాచ్ అవుతాయి. నాయకుడు వరల్డ్ నుంచి పుట్టుకొచ్చిన పాత్రలతోనే మరో కొత్త సినిమా చూపించాలనే ప్రయత్నం చేశారు మణిరత్నం. అయితే ఈ ప్రయత్నం తీవ్రంగా బెడిసికొట్టిందనేది వాస్తవం.