మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ: ఊపిరి సలపని ఉత్కంఠ

Manjummel Boys Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ : 3/5

-అన్వ‌ర్‌

గతవారం మ‌ల‌యాళం నుంచి వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ సరైన వసూళ్ళు లేకపోయినప్పటికీ మంచి సినిమా అనే పేరు తెచ్చుకుంది. ఈవారం అదే జోనర్ లో మరో సినిమా తెలుగు ప్రేక్షకులని పలకరించింది. అదే.. మంజుమ్మల్ బాయ్స్. ఇప్పటికే ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్ అయ్యింది. రూ.20కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.200కోట్ల పైగా సాధించింది. ఇప్పుడు అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. మరి మలయాళంలో అంతటి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని అలరించిందా? మంజుమ్మల్ బాయ్స్ పంచిన థ్రిల్ ప్రేక్షకులు ఆస్వాదించేలా ఉందా?

అది 2006. కేరళ లోని కొచ్చి. కుట్టన్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు మరికొందరు స్నేహితులు సొంత ఊళ్లోనే చేతికందిన పని చేసుకుంటూ సరదాగా జీవితం గడిపేస్తుంటారు. ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ కి మంజుమ్మల్ టీం అని పేరు. ఎక్కడికైనా గ్రూప్ గా వెళ్తుంటారు. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ టూర్ కి వెళ్తారు. అక్క‌డి ప్రదేశాల‌న్నీ చూశాక చుట్టేసి, చివ‌ర్లో గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. గుణ కేవ్స్‌ ఎంట్రన్స్ తప్పితే లోపలకి పర్మిషన్ వుండదు. ఎందుకంటే అందులో ప్రమాదకరమైన లోయ‌లుంటాయి. వాటిని డెవిల్స్ కిచెన్ అని పిలుస్తారు. అందులో పడ్డవారు తిరిగొచ్చిన దాఖలాలు లేవు. ప్రవేశం నిషిద్ధం అనే డేంజర్ బోర్డ్ తో పాటు వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేసుంటుంది. అయితే ఆ కంచె దాటి లోపలకి వెళ్తారు ‘మంజుమ్మల్ బాయ్స్’. గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. మొదట్లో దాన్ని ఫ్రాంక్ అనుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత అర్ధమౌతుంది. నిజంగానే అగాధం లాంటి లోయలోకి జారిపోయాడని. ఆ త‌ర్వాత ఏమైంది? సుభాష్‌ను ప్రాణాల‌తో కాపాడటానికి స్నేహితులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? పోలీస్, ఫైర్ శాఖలు ఎలాంటి సహకారాన్ని అందించాయి? చివరి సుభాస్ ప్రాణాలతో బయటికికొచ్చాడా లేదా ? అనేది తక్కిన కథ.

ఎలాంటి కథని చెప్పినా అందులో ప్రేక్షకుల్ని లీనం చేయించే వరల్డ్ బిల్డింగ్, యాంబియన్స్ ను క్రియేట్ చేయడంలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ మంచి నైపుణ్యం సాధించారు. కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్. నిజంగా జరిగిన సంఘటనే. ‘బోరు బావిలో పడిన చిన్నారిని రక్షించిన అధికారులు..’ లాంటి వార్తలు తరుచూ చూస్తుంటాం. ఇది కూడా అలాంటి య‌థార్థ కథే. అయితే ఈ య‌థార్థ సంఘటనని ద‌ర్శకుడు చిదంబ‌రం తీసిన విధానం, ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా చోట్ల ఆశ్చర్యపరుస్తుంది. తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తుంది.

కథ, అందులోని కోర్ ఎమోషన్ ప్రేక్షకులకు ఎక్కించడానికి కావల్సినంత సమయం తీసుకోవడం మలయాళం సినిమాల స్టయిల్. ఇందులోనూ అది కనిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేప‌థ్యాన్ని, వాళ్ళ స్నేహాన్ని చూపెడుతూ మొదట్లో వచ్చే సన్నివేశాలు నింపాదిగా అనిపిస్తాయి. అందులో దాదాపు కొత్త మొహాలే కావడంతో మొదట్లో కాస్త గజిబిజిగా కూడా వుంటుంది. టూర్ మొదలైన గుణ కేవ్స్ కి వచ్చేవరకూ ఏదో కాలక్షేపం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే భావనే కనిపిస్తుంది. ఎప్పుడైతే సుభాస్ లోయలోకి జారిపోయాడో.. సుభాస్ తో పాటు ప్రేక్షకుడిని కూడా కథలోకి దించేశాడు దర్శకుడు. సినిమా పూర్తయినంత వరకూ చూడాల్సిందే. ప్రేక్షకుడికి మరో ఆప్షన్ లేదనే రీతిలో మిగతా సన్నివేశాలని నడిపాడు.

స‌ర్వైవ‌ల్ డ్రామాలో ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో వుందో ప్రేక్షకుడికి తెలియజేయడం చాలా ముఖ్యం. దీని కోసం డెవిల్ కిచెన్ నేపధ్యాన్ని స్థానిక పాత్రలతో మిస్టీరియస్ గా చిత్రీకరించిన తీరు ఈ కథలో మరింత లీనమయ్యేలా చేసింది. గతంలో కేంద్రమంత్రి అల్లుడు ఆ లోయపడితే ఎన్ని బలగాలతో ప్రయత్నించినా చిన్న ఎముక కూడా దొరకలేదని చెప్పే ప్లాష్ బ్యాక్, అందులో దెయ్యాలు వున్నాయని, అవి బలి తీసుకుంటాయని స్థానికులు చెప్పే మాటలు.. ఇవన్నీ ప్రేక్షకుడికి కావల్సినంత ఆసక్తిని కలిగించేలా చేశాయి. ఇంత ప్రమాద‌కరమైన చోటు నుంచి స్నేహితుడ్ని ఎలా కాపాడుతారనే సానుభూతిని కూడా జనరేట్ చేశాయి.

దర్శకుడు చిదందరం ఈ కథలోకి సబ్ టెక్స్ట్, మెటాఫర్ లని చాలా అద్భుతంగా చేర్చాడు. ఊర్లో మంజుమ్మల్ బాయ్స్ టీం, మరో గ్యాంగ్ తో ‘టగ్ అఫ్ వార్’ లో ఎప్పుడూ ఓడిపోతుంటుంది. అది గెలవాలని రోజూ ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ ఈ ప్రాక్టిస్ లో కుట్టన్ (షౌబిన్ షాహిర్‌) పాల్గొడు. చూస్తుంటాడంతే. సుభాష్ (శ్రీనాథ్ భాషి)కి చిన్నప్పటి నుంచి క్లాస్ట్రోఫోబియా లక్షణాలు వుంటాయి. ఇరుగ్గా వుండే చోటు అంటే తనకి భయం. అలాంటి తను లోయలో పడిపోతాడు. ఈ రెండు పాత్రల చుట్టూ రాసుకున్న ఎమోషన్ చాలా చక్కగా పండింది. ‘టగ్ అఫ్ వార్’జోలికి పోనీ కుట్టన్ స్నేహితుడి కాపాడటానికి అదే తాడు పట్టుకొని లోయలో దిగుతాడు. లోయలోకి దిగిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఎంత సహజంగా తీశారంటే.. ప్రేక్షకుడు కూడా లోయలో చిక్కుకున్న ఫీలింగ్ లోకి జారుకుంటాడు. ఆ క్లాస్ట్రోఫోబియా ని ప్రేక్షకుడు కూడా ఫీలౌతాడు. చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేయడం కూడా బాగా కుదిరింది. క్లైమాక్స్ లో ‘మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు!! అగ్నిలాగ స్వచ్ఛమైనది’ గుణ పాటలోని ఈ లైన్ ప్లే చేశారు. ఇది ప్రేక్షకుడికి లోయనుంచి బయటికొచ్చినంత రిలీఫ్ ఇచ్చింది. ఆ స్నేహితుల కథలోని బ్రోమాన్స్ మరోస్థాయికి వెళ్ళింది.

షౌబిన్ షాహిర్‌, శ్రీనాథ్ భాషి ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. మిగతా అందరూ కొత్తే. షౌబిన్, శ్రీనాథ్ పాత్రల చుట్టూనే మెయిన్ ఎమోషన్ ని నడిపారు. స్నేహితులందరినీ తెరపై చూస్తున్నపుడు నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ వుండాలనే ఫీలింగ్ కలుగుతుంది. ‘మేము పది మంది వచ్చాం. పదిగురుగానే వెళ్తాం’అని పోలీసులతో చెప్పే సన్నివేశం కదిలిస్తుంది. స్నేహితుడి రక్షించుకోవాలనే ఆశ అందరి కళ్ళలో వుంటుంది. పోలీసు అధికారులు, స్థానికులుగా కనిపించిన మిగతా పాత్రలు కూడా సహజంగా కుదిరాయి. టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా కనిపిస్తుంది. విజువల్స్ తో ప్రేక్షకుడిని కథలో బంధించాడు కెమెరామెన్‌. గుణ కేవ్ సన్నివేశాలని చాలా సహజంగా తీశారు. నేపధ్య సంగీతం ఉత్కంఠని మరో స్థాయిలోకి తీసుకెళ్ళింది. సర్వైవల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘మంజుమ్మల్ బాయ్స్’ నచ్చేస్తారు.

తెలుగు360 రేటింగ్ : 3/5

-అన్వ‌ర్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close