ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేయగానే తదుపరి ఉపరాష్ట్రతి ఎవరు అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కసరత్తు చేశారో లేదో కానీ.. దేశంలోని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అంతా ఎవరికి వారు తమ జాబితాలను ప్రకటించేస్తున్నారు. నితీష్ కుమార్ దగ్గర నుంచి చంద్రబాబు వరకూ అనేక మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇదేదో బాగుందని రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు బీజేపీ నేతల్లోనే ఒకరి పేరును ప్రతిపాదించి..బీసీకి ముడిపెట్టేస్తున్నారు.
నితీష్ నుంచి చంద్రబాబు వరకూ.. !
ఉపరాష్ట్రపతి పదవికి నితీష్ కుమార్ పేరును మోదీ పరిశీలిస్తున్నారని ఆయన ఒప్పుకుంటే ఆయనకే పదవి గ్యారంటీ అని ప్రచారం మొదట ప్రారంభమయింది. ఆ తర్వాత నుంచి వరుసగా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చంద్రబాబును ఉపరాష్ట్రపతిని చేసి.. నారా లోకేష్ ను సీఎం చేయవచ్చన్న ప్రచారాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రారంభించారు. ఇలాంటి మసాలా దొరికితే.. ఏపీ రాజకీయ పురుగులు ఊరుకుంటాయా?. ఆ అంశంపై కొరికేయడం ప్రారంభించాయి.
గడ్కరీ నుంచి రాజ్ నాథ్ వరకూ !
మరో వైపు వీళ్లే మోదీ తనకు పార్టీలో అడ్డు లేకుండా ఉండటానికి సీనియర్ నేతలు అయిన గడ్కరీ, రాజ్ నాథ్, నడ్డా లాంటి వాళ్ల పేర్లను పరిశీలించవచ్చని విశ్లేషిస్తున్నారు. ప్రతి పేరుకు ఓ కారణం వెదుక్కుంటున్నారు. చంద్రబాబును ఢిల్లీకి పంపడానికి, మోదీకి అడ్డం లేకుండా ఉండటానికి, నితీష్ కుమార్ భారం దించుకోవడానికి అని కారణాలు చెబుతున్నారు.
అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రధాని మోదీ, అమిత్ షా
రాజ్యాంగ పదవుల నియామకాల విషయంలో మోదీ, షాలు అనూహ్యమైనా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరూ ఊహించలేరు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు పేరు ప్రకటించే వరకూ నిపుణుల చర్చల్లో కూడా పరిశీలనకు రాలేదు. అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రకటించినప్పుడు ధన్ ఖడ్ పేరు కూడా అనూహ్యంగా ఖరారు అయింది. ఇప్పుడు కూడా చర్చల్లో వచ్చే పేర్ల కన్నా.. ఎవరికీ తెలియని .. ఊహించని నేతను ఉపరాష్ట్రపతిగా మోదీ, షాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జోక్యం చేసుకునే చాన్స్ లేదు. అంతా వారి అభీష్టానికే వదిలేస్తారని అనుకోవచ్చు.