దశాబ్దాల పాటు సాయుధ పోరాటం చేసిన మావోయిస్టు అగ్రనేతలు ఇప్పుడు వరుసగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల్లో మావోయిస్టులపై కఠినమైన నిర్బంధం కొనసాగుతోంది. అక్కడ దొరికితే ఎన్కౌంటర్ చేస్తారనే భయం అగ్రనేతల్లో బలంగా ఉంది. అందుకే, ప్రాణ రక్షణ కోసం వారు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, పౌర హక్కుల పట్ల కొంత మెత్తని వైఖరి ఉంటుందనే నమ్మకంతోనే అగ్రనేతలు ఇక్కడికి వచ్చి లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నారు.
అమిత్ షా డెడ్ లైన్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం పూర్తిగా అంతం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టార్గెట్ను పూర్తి చేయడంలో తెలంగాణ పోలీసులు ఇప్పుడు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తుపాకీ గుళ్లకు బలవ్వడం కంటే, తెలంగాణలో లొంగిపోయి ప్రభుత్వ పునరావాస ప్యాకేజీలు పొందడం మేలని మావోయిస్టులు భావిస్తున్నారు. ఈ పరిణామం కేంద్రం నిర్దేశించిన గడువు లోపు మావోయిస్టు రహిత భారత నిర్మాణానికి మార్గం సుగమం చేస్తోంది.
వృద్ధాప్యం, అనారోగ్యం.. పోరాటం నుంచి విరమణ
ప్రస్తుతం లొంగిపోతున్న మావోయిస్టు నాయకుల్లో అత్యధికులు వృద్ధాప్యంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దట్టమైన అడవుల్లో సరైన వైద్యం అందకపోవడం, పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడంతో వారు ఏకాకిగా మారుతున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో, క్షేమంగా బయటపడటానికి తెలంగాణ సరిహద్దులను వాడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు, కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందనే ఆశ వారిని ఇటు వైపు నడిపిస్తోంది.
ముగింపు దశకు సాయుధ పోరాటం
ఒకప్పుడు దక్షిణ భారత దేశాన్ని వణికించిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు క్రమంగా తెరమరుగవుతోంది. అగ్రనేతలంతా జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధపడటంతో కేడర్ పూర్తిగా చెల్లాచెదురైంది. అమిత్ షా గడువు సమీపిస్తున్న వేళ, మిగిలిన కొద్దిమంది నేతలు కూడా త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాత్మకమైన లొంగుబాటు విధానం వల్ల రక్తం చిందించకుండానే ఒక పెద్ద విప్లవ పోరాటానికి చరమగీతం పాడే పరిస్థితి కనిపిస్తోంది.
