తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ బర్సె దేవా అలియాస్ సుక్కా మరో 15 మంది క్యాడర్‌తో తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. బర్సె దేవా తలపై రూ. 50 లక్షల రివార్డు ఉంది. మాడ్వి హిడ్మాకు బర్సె దేవా అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు సాయుధ దళాల బాధ్యతలను దేవా స్వీకరించారు. ఇప్పుడాయన లొంగిపోయారు.
దేవా తన వద్ద ఉన్న అత్యాధునిక మౌంటెడ్ ఎల్ఎంజీ తుపాకీని, ఇతర మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించారు. ఈయనతో పాటు లొంగిపోయిన మిగిలిన 15 మంది కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీలో తీవ్రమైన భావజాల విభేదాలు, అనారోగ్యం మరి, ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్యాకేజీల పట్ల ఆకర్షితులై వీరు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా సరెండర్ చేయడంతో మావోయిస్టు పార్టీకి ఇక ఆయుధాల కొరత కూడా ఏర్పడనుంది.
బర్సె దేవా లొంగుబాటును మావోయిస్టు ఉద్యమానికి, ముఖ్యంగా దండకారణ్య ప్రాంతంలో ఆ పార్టీ ఉనికికి పెద్ద దెబ్బగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయం చేసే కీలక నేత ఇలా లొంగిపోవడం వల్ల ఆ పార్టీ మిలిటరీ విభాగం ఛిన్నాభిన్నమైంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమ ముగింపు దశకు చేరుకుందని.. డెడ్ లైన్ అయిన మార్చి 31లోపే పని పూర్తవుతుందని బలగాలు చెబుతున్నాయి.
