రూ. కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత సుజాతక్క అలియాస్ పోతుల కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె తలపై రూ. కోటి రివార్డు ఉందంటే ఎంత కీలకంగా పని చేశారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 106 కేసులు ఆమెపై ఉన్నాయి. పోలీసులతో చాలా పకడ్బందీగా రాయబారం నడిపి ఆమె సరెండర్ అయిపోయారు. పోలీసులు వెంటనే.. అదే వేదిక మీద రూ. పాతిక లక్షలు ఇచ్చి.. జన జీవన స్రవంతిలో కలిసేందుకు చాన్స్ ఇచ్చారు. ఈమే మరో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య. వేణుగోపాల్ ను చాలా ఏళ్ల క్రితమే ఎన్ కౌంటర్ చేశారు.
లొంగిపోతారా.. చచ్చిపోతారా.. రెండే ఆప్షన్లు ఇచ్చిన అమిత్ షా!
మావోయిస్టుల్ని లేకుండా చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ టార్గెట్ పెట్టుకున్నారు. అంతర్గత శత్రువుల్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే నిర్మూలిస్తున్నారు. అడవుల్ని జల్లెడ పట్టి.. దొరికిన సమాచారం ఆధారంగా వెంటాడి వేటాడుతున్నారు. నక్సలైట్లకు ప్రజా సానుభూతి లభించడం లేదు. వారు ఇష్టం వచ్చినట్లుగా.. పోలీసులు, నేతలు .. అడవి బిడ్డలపై దారుణాలు చేసిన ఘటనలు దీనికి కారణం. ఈ పరిస్థితిని కేంద్రం బాగా అర్థం చేసుకుంది. కానీ వారికి ఓ చాన్స్ ఇచ్చింది. లొంగిపోతే రివార్డులు ఇచ్చేందుకు సిద్ధమయింది.
తీసుకుంటే రివార్డు.. లేకపోతే ఎన్ కౌంటర్ ఖాయం
ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. దాక్కుని చేసే ఉద్యమాలకు అవకాశం లేదు. ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి కాల్చేయగల సామర్థ్యం బలగాలకు ఉంది. ఇలాంటి సమయంలో అడవుల్లో ఉండి ఉద్యమం చేయడం తెలివి తక్కువ పని. కానీ మావోయిస్టుల్లో ఇప్పటికీ కొంత మంది మార్పు చెందడానికి సిద్ధంగా లేరు. అందుకే వారంతా జనజీవన స్రవంతిలోకి రావడం లేదు. తలలపై కోట్ల రివార్డులు ఉన్న వారిలో కొంత మందిలో మార్పులు వస్తున్నాయి. ఇంత కాలం ఎంత చేసినా చిన్న మార్పు సాధించలేకపోయాం.. ఇప్పుడైనా బయటకు వెళ్లిపోదామనుకుంటున్నారు. సుజాతక్క లాంటి వాళ్లే దానికి నిదర్శనం. వెళ్లకపోతే.. ఖచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తారు. ఒక రోజు.. అటూ ఇటూ తేడా అంతే అని.. సుజాతక్క లాంటి వాళ్లకు అర్థమైపోయింది.
తుపాకీ గొట్టంతో సాధ్యం కాదు.. ప్రజాస్వామ్యంతో సాధ్యం!
నక్సలైట్లు దేశభక్తులే అని ఒకప్పుడు అనేవారు. నక్సలిజం అంటే.. పోలీసుల్ని .. రాజకీయ నేతల్ని.. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనుల్ని చంపడం కాదు. నక్సలిజం అంటే పేద ప్రజలకు అండగా ఉండటం. ఆ భావాలు అందుకే చాలా మందికి నచ్చుతాయి. కానీ హింసకారణంగా మొత్తం డిటాచ్ అయిపోయింది. ఇప్పుడు నక్సలిజం.. ప్రజాస్వామ్యంలో ఉండాలి. వారంతా ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం పోరాడిన.. ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. తుపాకీగొట్టంతో ఏదీ సాధించలేరు. అందుకే.. లొంగిపోవడమే మంచిది. సుజాతక్క బాటలోనే ఇతర నక్సల్ నాయకత్వం నడిస్తే.. .. ఎన్ కౌంటర్.. భారీగా మావోయిస్టుల మృతి అనే వార్తలు రావడం ఆగిపోతాయి.