రివ్యూ : మార్టిన్‌ లూథర్‌ కింగ్‌

Martin Luther King movie review

తమిళంలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డ్ అందుకున్న చిత్రం ‘మండేలా’. 2021 కరోనా కాలంలో నేరుగా టీవీలో విడుదలైయింది. యోగిబాబు ప్రధాన పాత్రలో మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ మాటల రచయితగా జాతీయ అవార్డులు అందుకున్నాడు అశ్విన్. కుల, వర్గ, ఓటు బ్యాంక్ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా వచ్చిన ఈ చిత్రాన్ని ఇపుడు తెలుగులో సంపూర్ణేష్‌బాబు ప్రధాన పాత్రలో ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ గా రీమేక్ చేశారు. పూజ కొల్లూరు దర్శకురాలు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. తమిళంలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఎలా కుదిరింది ?ఇక్కడ నేటివిటికి తగ్గట్టు ఎలాంటి మార్పులు చేశారు ? మండేలా కథ ఆత్మని తెలుగు రూపకర్తలు పట్టుకోగలిగారా ? యోగిబాబు పాత్రకు సంపూర్ణేష్ బాబు న్యాయం చేశాడా ?

అది పడమరపాడు అనే గ్రామం. ఆ గ్రామంలో ప్రజలు కులం పేరుతో ఉత్తరం, దక్షణం అని రెండు వర్గాలుగా విడిపోయివుంటారు. ఎన్నో ఏళ్ళుగా రెండు కులాల మధ్య నిత్య ఘర్షణ వుంటుంది. ఆ గొడవలు తగ్గించి వారిమధ్య సఖ్యత పెంచడానికి ఆ గ్రామ సర్పంచ్ రెండు కులాలు చెందిన ఇద్దరిని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహంతో ఆ రెండు కులాలు కలసి కట్టుగా ఉంటాయనేది ఆయన ఆలోచన. అది జరగకపోగా.. సర్పంచ్ గారి ఇద్దరి అబ్బాయిల కారణంగా గొడవలు ఇంకా పెరుగుతాయి. సరిగ్గా పంచాయితీ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో సర్పంచ్ కి పక్షవాతం చేస్తుంది. ఆయన ఇద్దరు కొడుకులు పోటీకి నిలబడతారు. సర్పంచ్ పెద్దకొడుకు జగ్గు( నరేష్)చిన్నకొడుకు లోకి(వెంకటేష్ మహా) ఇద్దరూ సర్పంచ్ నామినేషన్ వేస్తారు. తమ కులం వారిగా ఓట్లని ముందుగానే లెక్క పెట్టుకుంటారు. ఇద్దరికి ఓట్లు సమానంగా వస్తాయి. ఇప్పుడు గెలవాలంటే ఒక ఓటు కావాలి. సరిగ్గా అదే సమయంలో ఆ వూర్లో చెప్పులు కుట్టుకొని చెట్టుకింద బ్రతికే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్( సంపూర్ణేష్‌బాబు) కు కొత్తగా ఓటు హక్కు వస్తుంది. మార్టిన్ లూథర్ కింగ్ ఆ ఇద్దరిలో ఏ వర్గానికి చెందిన వాడు కాదు. సర్పంచ్ గా గెలవాలంటే అతడి ఓటే డిసైడర్. అతనే కింగ్ మేకర్. మరి మార్టిన్ లూథర్ కింగ్ ఓటు కోసం.. జగ్గు, లోకి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు స్మైల్ కి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు ఎలా వచ్చింది ? అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి రెండు వర్గాలు ఎలా తిరిగాయి ? చివరికి ఆ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చింది ? అనేది మిగతా కథ.

ముందుగా ‘మండేలా’ దర్శకుడు మడోన్ అశ్విన్ ని అభినందించాలి. దేశంలో వున్న కులాలు, వర్గాలు, ఎన్నికలు జరుగుతున్న శైలిని ఒక గ్రామం ద్వారా ప్రతిబించే కథని రాసుకొని ఎక్కడా కూడా సందేశం ఇస్తున్నట్లుగా లేకుండా మంచి హ్యుమర్ ఆరోగ్యకరమైన సెటైర్ కలిగిన కథని రాసుకున్నాడు. ఈ కథకు నేటివిటీ సమస్య లేదు. ఈ కథని తెలుగుకి తీసుకొచ్చిన దర్శకురాలు పూజ కొల్లూరు, వెంకటేష్.. కథలో ఆత్మ ఎక్కడా చెడిపోకుండా నిజాయితీగా చిత్రీకరీంచే ప్రయత్నం చేశారు.

గ్రామ ప్రజలు బహిర్భూమి లో కాలకృత్యాలు తీర్చుకునే సన్నివేశంతో కథ మొదలౌతుంది. తర్వాత గ్రామంలో రెండు వర్గాల కోసం కట్టిన మరుగుదొడ్డి సన్నివేశం తెరపైకి వస్తుంది. ఈ సన్నివేశం చాలా సుదీర్గంగా వుంటుంది. లోతుగా పరిశీలిస్తే కథకు మూలమైన సన్నివేశం ఇది. ఈ సన్నివేశంలోనే గ్రామ సమస్యలు, ఆక్కడ రాజాకీయలు, వర్గ పోరు ఇలా కీలకమైన కథని చాలా సహజంగా చిత్రీకరించారు. అక్కడే ఇందులో ప్రధాన పాత్ర అయిన స్మైల్ పాత్రని కూడా పరిచయం చేసి కథలో తీసుకొచ్చారు. ఈ సనివేశాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరు.. ఓటరు యొక్క మానసిక స్థితిని ప్రతిభింబించేలా వుంటుంది. ఈ సన్నీవేశంలో ఓ రెండు వర్గాలు తమ ఈగో కోసం, ఆధిపత్యం కోసం కొట్టుకుంటాయి. ఆ గొడవని.. దూరం నుంచి చూసి ప్రేక్షక పాత్ర పోషిస్తాడు స్మైల్( ఓటరు). గొడవ పూర్తయిన తర్వాత ‘పదా అయిపొయింది’ అని లేచి వెళ్ళిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఎంత లోతుగా ఆలోచిస్తే అంత అంతర్లీనంగా ఆలోచన రేకెత్తించే సెటైర్ కనిపిస్తుంది.

తొలి సన్నివేశమే ప్రేక్షకులని కథలోకి తీసుకెల్లిపోతుంది. గొప్ప మలుపులు, ఆశ్చర్యాలు వున్న కథ కాదు ఇది. ప్రతి సన్నివేశం ఊహుకు అందుతూనే వుంటుంది. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. దీనికి కారణం కథలోని నిజాయితీ. కథ నుంచి ఎక్కడా డైవర్ట్ కాకుండా కథనం నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. స్మైల్ చెప్పులు కుంటూ వూర్లో దొరికిన పని చేసుకుంటూ చెట్టు కింద హాయిగా బ్రతకడం, దాచుకున్న డబ్బులు పోవడంతో పోస్ట్ ఆఫీస్ కి ఆశ్రయించడం, అక్కడ పోస్ట్ విమన్ గా పని చేస్తున్న వసంత పాత్ర స్మైల్ కి ఒక గుర్తింపు ఇవ్వాలని ప్రయత్నించడం, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గా నామకరణం చేసి ఓటర్ కార్డ్ కి అప్లయ్ చేయడం, మరో పక్క ఎన్నికల్లో ఓట్లు కోసం లోకి జగ్గు చేసే ప్రయత్నాలు.. సరదాగా సాగిపోతుంటాయి. విరామం ఘట్టం కూడా ముందే తెలిసిపోతుంది కానీ ఆసక్తికరంగా వుంటుంది.

సెకండ్ హాఫ్ దాదాపుగా మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ని ప్రసన్నం చేసుకోవడానికి లోకి, జగ్గు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఆ సనివేశాలన్నీ ఓటు కోసం నాయకులు చేసే విన్యాసాలని తలపిస్తాయి. ఓటు కోసం అడిగిన, అడగని తాయిలాలని ఎలా ఇస్తారో.. ఉచితాలతో ఎలా ప్రలోభ పెడతారో, గెలుపు కోసం నాయకులు ఎంతకి తెగిస్తారో .. ఇవన్నీ తెరపైకి వస్తాయి. అదే క్రమంలో ఓటుని ఒక ఆయుధంగా వాడాల్సిన ఓటరు.. పదికి ఇరవైకి ఓటుని ఎంతలా వ్యర్ధం చేసుకుంటాడో కూడా చరకలు అంటించే విధంగా కొన్ని సన్నివేశాలని తీర్చిద్దిద్దారు. ఇవన్నీ ఒక సందేశంలా కాకుండా ప్రేక్షకుడికి వినోదంతో పాటు మానసిక ఉల్లాసం ఇచ్చే విధంగానే తీర్చిదిద్దారు.

సంపూర్ణేశ్‌ బాబు ఇప్పటివరకూ స్పూఫ్‌ కామెడీలే చేశాడు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పాత్ర తనని కొత్తగా పరిచయం చేసింది. ఆ పాత్రకు కావాల్సిన అమాయకత్వం ఆయనలో చక్కగా కుదిరింది. చాలా నిలకడగా ఆ పాత్రని పోషించాడు. తనలో భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. జగ్గు పాత్రలో నరేశ్‌ తన అనుభవం చూపించారు. లోకి పాత్ర చేసిన వెంకటేశ్‌ మహా కూడా చాలా సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. వసంత పాత్రలో శరణ్య ఆకట్టుకుంది. చాలా హుందాగా కనిపించింది. బాటా బాబు గా చేసిన పిల్లాడు కూడా కథకు మంచి ఎమోషన్ ని తీసుకొచ్చాడు. మిగతా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి.

టెక్నికల్ గా సినిమా బావుంది. మంచి కెమరాపనితనం కుదిరింది. నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ఆర్ట్ వర్క్ విషయానికి వస్తే.. ఎలాంటి అభివృద్ధి లేని ఓ గ్రామాన్ని చూపించే ప్రయత్నం జరిగింది కానీ అది తెలుగు రాష్ట్రాల్లోని గ్రామంలా అనిపించదు. తమిళనాడులోని బోర్డర్ లో ఎదో ఊరులా అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకాస్త శ్రద్ధపెట్టాల్సింది. మాటలు చాలా వరకూ తమిళం నుంచే తీసుకున్నారు. కొన్ని మాటలు కితకితలు పెడితే ఇంకొన్ని మాటలు ఆలోచింపజేశాయి.

ఈ సినిమా ముగింపు చాలా మందికి వెలితిగా అనిపించవచ్చు. అప్పటివరకూ ఎన్నికల ఫలితంపై కథ మొత్తం నడిపారు కానీ ఫలితం ప్రకటించకపోవడం ఏమిటనే ప్రశ్న రావచ్చు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఎవరికీ ఓటు వేశాడు ? అనే కుతూహలం అందరికీ వుంటుంది. అయితే కథకుడు ఈ నిర్ణయం ప్రేక్షకులకే వదిలేశాడు. ఓటు వేయడానికి డబ్బు తీసుకోవడం తప్పు అనే కనువిప్పు ఆ గ్రామస్తల్లో వస్తుంది. తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తారు. అప్పటికే ఒక ఓటుతో గ్రామానికి ఎన్ని అభివృద్ధి పనులు చేయొచ్చో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పాత్ర ద్వారా చూపించారు. ఒక సందర్భంలో ఇలా నన్ను హింసిస్తే ‘నోటా’ కి ఓటు వేస్తానని చెప్తాడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. ప్రజలకు ఓటు విలువ తెలిసింది. ఒకవేళా మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఓటు నోటాకి వేస్తె.. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు ఓటు విలువ తెలిసింది కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకుడిని ఎంచుకుంటారనే కోణంలో ఈ కథని ముగించి అలోచించుకునే అవకాశం ప్రేక్షకులు( ఓటర్లు)కే వదిలారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close