రివ్యూ : ‘మసూద’

Masooda Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ 2.5/5

భయం కూడా ఒక కమర్షియల్ ఎలిమెంటే. హారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక సెటప్ ఆడియన్స్ వుంటారు. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో హారర్ సినిమాలు తగ్గిపోయాయి. హారర్ ని కామెడీ చేస్తూ కొన్ని సినిమాలు వస్తున్నాయి కానీ పూర్తిస్థాయిలో భ‌య‌పెట్టే సినిమాలు అరుదైపోయాయి. దీనికి చాలా కారణాలు వున్నాయి. థియేటర్ లో హారర్ సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోవడం. ఓటీటీలో హారర్ కంటెంట్ అప‌రిమితంగా వుండటం. ఇలాంటి నేపధ్యంలో పూర్తి హారర్ సినిమాగా వచ్చింది ‘మసూద’. సంగీత, తిరువీర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శ‌కుడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి డిఫరెంట్ మూవీని నిర్మించిన రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాత కావడం, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో హారర్ ని ఇష్టపడేవారితో ‘మసూద’పై ఆసక్తి పెరిగింది. మరి ట్రైలర్ లో భయపెట్టిన ‘మసూద’ థియేటర్ లో ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? హారర్ ఆడియన్స్ ని మళ్ళీ థియేటర్ లోకి రప్పించగలిగిందా ?

నీలమ్ (సంగీత) తన కూతురు నాజియాతో కలసి భర్తకు దూరంగా ఓ అపార్ట్మెంట్ లో జీవిస్తుంటుంది. నీలమ్ స్కూల్ లో సైన్స్ టీచర్. అదే స్కూల్ లో నాజియా కూడా చదువుతుంటుంది. నీలమ్ వుండే అపార్ట్ మెంట్ లోనే గోపి కృష్ణ ( తిరువీర్‌) ఉంటాడు. నీలమ్, నాజియాతో ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోతాడు. గోపికి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం. బేసిగ్గా చాలా భయస్తుడు. సడన్ గా ఓ రోజు నీలమ్ కూతురు నాజియా దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే ఏవో మందులు ఇస్తారు. కానీ నాజియా ప్రవర్తనలో మార్పు రాదు. డాక్టర్ వల్ల కాదని భావించిన నీలమ్, గోపి.. దుష్ట శక్తుల్ని త‌రిమికొట్టే పీర్ బాబాని ఆశ్రయిస్తారు. పీర్ బాబా నీలమ్ ని చూసి ఆ దుష్ట శక్తిని ఆవహించిన ఆత్మని తొలగించడం తన వల్ల కాదని, రిజ్వాన్ బాబా (శుభలేఖ సుధాకర్)ని ఆశ్రయించాలని సూచిస్తాడు. నీలమ్ , నాజియాని రిజ్వన్ దగ్గరికి తీసుకెళ్తుంతుంది. నాజియాని చూసి రిజ్వాన్ .. నాజియాని అవహిచింది పదేళ్ళ క్రితం నీలమ్ ఇంటి పక్కనే దారుణ‌ హత్యకు గురైన `మసూద` అని చెబుతాడు. అసలు మసూద ఎవరు ? ఆమెను ఎందుకు హత్య చేశారు ? నాజియాలోకి ఆమె ఎలా వచ్చింది ? మాసూద ఆత్మని తొలగించడానికి నీలమ్, గోపి ఎలాంటి సాహసాలు చేశారు అనేది మిగతా కథ.

హారర్ కథలు దాదాపు ఒకే లైన్ లో వుంటాయి. ఒక ప్రేతాత్మ ఇంకొకరి ఆవహిస్తుంది. మిగిలిపోయిన తన లక్ష్యం కోసం వేరే శరీరంతో ప్రయత్నిస్తుంది. ఆ ప్రేతాత్మ పీడ వదిలించడానికి మరొకరు ప్రయత్నిస్తారు. దాదాపు హారర్ సినిమాల్లో కామన్ గా కనిపించిన ఈ వరసే మసూదలోనూ వుంది. అయితే హారర్ సినిమాల సక్సెస్ ఫార్ములా.. తీసుకునే బ్యాగ్డ్రాప్ పై ఆధారపడివుంటుంది. మసూద ఈ విషయంలో ‘కొత్త’ అనిపించుకుటుంది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాలొ రాని ఓ నేపధ్యాన్ని తీసుకున్నారు. అయితే ఆ నేపధ్యాన్ని హారర్ గా నడిపితే బావుండేది కానీ మితిమీరిన హింస, రక్తపాతం సృష్టించి దారుణమైన దృశ్యాలని కళ్ళముందు వుంచి దారుణకాండగా మార్చేసిన తీరు మాత్రం ఆకట్టుకోదు.

ఓ అర్ధరాత్రి, వర్షం, అడవి ప్రాంతం, గుర్రాలు.. ఒక మిస్టీరియస్ రూపం ఇద్దరిని ఎత్తుకుపోవడం.. ఇలా ఒళ్లు గ‌గుర్పాటుకి గురి చేసే ఎపిసోడ్ తో కథని మొదలుపెట్టాడు దర్శకుడు. అయితే దాని గురించి ప్రేక్షకుడికి ఎలాంటి డిటేయిల్ ఇవ్వకుండానే తర్వాత సీన్లు వస్తాయి. ఏదో జరుగుతోంద‌న్న‌ ఫీలింగ్ తప్పితే అదేంటో తెలీదు. తర్వాత కథ ప్రజంట్ లోకి వస్తుంది. నీలమ్, నాజీయా, గోపి ల పరిచయం, గోపి ఆఫీస్ లో లవ్ ట్రాక్ .. ఇవన్నీ రొటీన్ గా వుంటాయి. ఎప్పుడైతే నాజియాకి దెయ్యం పడుతుందో కథలో కొంచెం కదలిక వస్తుంది. అయితే ఇంటర్వెల్ వరకూ వచ్చే సీన్స్ ని రొటీన్ హారర్ స్టయిల్ లోనే నడిపారు.

నాజీయాకి మసూద ఆవహించిందని తెలుసుకున్న తర్వాత .. గోపి.. మసూద కథ తెలుసుకోవడానికి చేసిన విచారణ ఆసక్తికరంగానే వుంటుంది. మసూద నేపధ్యం మాత్రం చాలా భయానకంగా వుంటుంది. నిజానికి మసూద పాత్రని పరిచయం చేసిన తర్వాత.. ఆమె బ్యాక్ స్టోరీని కూడా చెప్పుంటే కథకు ఇంకా బలం చేకూరేది. కానీ ఆమె పాత్ర ఇలాంటదని కేలవం మాటతోనే చెప్ప మిగతా సీన్స్ ని హారర్ గా నడిపించారు. అయితే మసూద పాత్రలో వున్న దారుణమైన హింస భరించడం మాత్రం సున్నిత మనస్కులకు అంత సులభం కాదు.

మసూద కథ తెలిసిన తర్వాత.. కథ ముగించాలి. కానీ ఈ కథ ముగించిన విధానం మాత్రం చాలా లేజీగా వుంటుంది. ఫస్ట్ హాఫ్ లో హారర్ తగ్గింది కాబట్టి సెకండ్ హాఫ్ లో భయపెడతామని అనుకున్నారేమో.. ఒకొక్క సన్నివేశం సుదీర్ఘ‌ హింసాకాండగా మలిచిన విధానం మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది. దెయ్యం పట్టిన నాజీయా ఒకొక్కరిని ఫ్యాక్సనిస్ట్ లా తెగ నరుకుతుంటుంది. అటు అడవిలో నీలమ్ గోపి శవాన్ని సుదీర్గంగా తవ్వుతూనే వుంటారు. ఆ సీన్స్ చూస్తున్నపుడు ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ మర్చిపోయారా ? అనిపిస్తుంది. ఇక చివర్లో అన్ని రొటీన్ హారర్ కథల్లానే దెయ్యం వదిలిపోతుంది. అయితే దీనికి పార్ట్ 2 కూడా వుందని చివర్లో గోపి పాత్రలో ఇంకో సీన్ జోడించారు.

సంగీత మంచి నటి. ఓ మధ్య తరగతి తల్లిలా హుందాగా నటించింది. తిరువీర్ పాత్రని బాగా డిజైన్ చేశారు. భయస్తుడైన గోపి ఇంత హారర్ ని ఎలా భరిస్తాడో అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. తన నటన చాలా సహజంగా వుంటుంది. నాజియాగా చేసిన అమ్మాయి నటన కూడా బావుంది. శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, కావ్య మిగతా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి. అయితే తీరు, కావ్యల లవ్ ట్రాక్ ఈ కథకు ఉపయోగపడలేదు.

సాంకేతికంగా మాసూదకి మంచి మార్కులు పడతాయి. హారర్ మూడ్ ని ఎలివేట్ చేస్తూ చాలా మంచి విజువల్స్ ని రాబట్టుకున్నారు. ప్రశాంత్ విహారి సౌండ్ డిజైన్ కూడా బావుంది. చాలా సీన్స్ సౌండ్ వలనే భయపెట్టాయి. ఎడిటింగ్ కాస్త పదునుగా ఉండాల్సింది. దర్శకుడు కిరణ్ హారర్ కోసం మంచి నేపధ్యాన్ని తీసుకున్నాడు. అయితే దాన్ని ప్రజంట్ చేయడంలో మితిమీరిన హింసకు తావివ్వడంతో హారర్ సైడ్ ట్రాక్ పట్టేసి కేవలం ‘హింస’ మాత్రమే తెరపై కనిపించింది. కాక‌పోతే ఈ మ‌ధ్య వ‌చ్చిన హార‌ర్ సినిమాల‌తో పోలిస్తే.. మ‌సూద కాస్త కొత్త‌గా అనిపిస్తుంది. హార‌ర్ జోన‌ర్‌ని ఇష్ట‌ప‌డేవాళ్లు ఓసారి ఇటు ఓ లుక్కు వేయొచ్చు.

తెలుగు360 రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని...

మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....

పొత్తుండని టీడీపీ చెప్పకపోవడమే ఏపీ బీజేపీ నేతలకు అలుసైందా ?

ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close