ఎందుకో గానీ… ‘మాస్ జాతర’కు ముందు నుంచీ సరైన బజ్ లేదు. కాంబినేషన్పైనే ఆనాసక్తి నెలకొంది. రవితేజ ఫ్లాపుల్లో ఉన్నారు. శ్రీలీల పరిస్థితీ అంతే. నాగవంశీకి ఈమధ్య ఎదురు దెబ్బలు తట్టిగా తగియాలి. కింగ్ డమ్, వార్ 2 సినిమాలు నిరుత్సాహ పరిచాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నుంచీ.. ‘మాస్ జాతర’ వస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ప్రాజెక్ట్ ఇది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వాయిదాల పర్వం కూడా లో బజ్ కి ఓ ప్రధానమైన కారణం కావొచ్చు. 31న ప్రీమియర్లతో మాస్ జాతర ప్రయాణం మొదలు కాబోతోంది. ప్రీమియర్లకు అడ్వాన్సు బుకింగులు పెద్దగా లేవు. దానితో పోలిస్తే ‘బాహుబలి ఎపిక్’ చూడడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా మోంథా తుపాను ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణలో కూడా తుపాను ప్రభావం ఉంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల చూపు సినిమాల వైపు ఉండే అవకాశాలు చాలా తక్కువ. అక్టోబరు 31 గొప్ప డేట్ కాదన్న విషయం నాగవంశీకి కూడా తెలుసు. నెలాఖరు.. పైగా బాహుబలి తో పోటీ వుంది. రిలీజ్ డేట్ వాయిదా వేయాలన్నా ఆయన చేతుల్లో లేదు. ఎందుకంటే ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది ఓటీటీ సంస్థే. వాళ్ల ఒత్తిడి వల్ల ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయాల్సివస్తోంది. ప్రీమియర్లలో మంచి టాక్ వస్తే.. ఓపెనింగ్ డే కాస్తయినా వసూళ్లు కనిపిస్తాయన్నది నాగవంశీ ఆలోచన. సో.. ప్రీమియర్ టాక్ `మాస్ జాతర` కలక్షన్లను ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.