ఒక దేశ, రాష్ట్ర, ప్రాంత రాజకీయ చరిత్రను పుస్తకం లేదా వీడియో రూపంలో నిక్షిప్తం చేయడం చాలా అవసరం. దర్శకుడు దేవాకట్టా అదే ఆలోచనతో ‘మయసభ’ సిరీస్‌కు శ్రీకారం చుట్టాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చరిత్రను నాన్ ఫిక్షన్‌గా చెప్పాలంటే సవాలక్ష ప్రశ్నలు, అనుమతులు, ఆటంకాలు, అడ్డంకులు, విమర్శలు… అందుకే మయసభ నిండా అబద్దాలే ఉన్నాయి, అంతా ఫిక్షన్, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి పాత్రను తీసుకోలేదు, ఇది ఎవరి బయోపిక్ కాదని ముందే డిస్క్లైమర్ వేసి కావలసినంత క్రియేటివ్ స్పేస్ తీసుకున్నాడు. అంతా ఫిక్షన్ అని చెప్పినప్పటికీ ఈ వెబ్ సిరీస్‌లో చాలా వరకు నిజజీవిత సంఘటనలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు, సామాజిక స్థితిగతులు, కుల ఘర్షణలు, నక్సలిజం ఉద్యమాలపై అవగాహన ఉన్న వారికి మయసభ ది డిస్కవరీ ఆఫ్ తెలుగు పాలిటిక్స్ అనే భావన కలుగుతుంది.
తెలుగు రాష్ట్ర రాజకీయాన్ని చెప్పడానికి చిత్తూరు జిల్లాకు చెందిన కాకర్ల కృష్ణమనాయుడు (కేకేఎన్), కడప జిల్లాకు చెందిన ఎంఎస్ రామిరెడ్డి (ఎంఎస్ఆర్) పాత్రలను ఎంచుకున్నాడు దేవకట్టా. ఈ రెండు పాత్రలు నిజ జీవితంలో ఎవరిని పోలినవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజ జీవితంలో ఒకే పార్టీలో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన ఈ నాయకుల మధ్య ఉన్న స్నేహానికి మరింత కల్పన జోడించి తొమ్మిది ఎపిసోడ్ల(దాదాపు ఏడు గంటల నిడివి) వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు దేవకట్టా. ఫిల్మ్ మేకర్‌గా దేవకట్టాకు బలమైన వాయిస్ ఉంది. ఈ వెబ్ సిరీస్‌లో తన మార్క్ చాలా చోట్ల కనిపించింది. చెప్పదలచుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు.
పెద్దాయన పార్టీ నుంచి సస్పెండ్ చేయబోయే 35 ఎమ్మెల్యేల సీక్వెన్స్ కథ మొదలవుతుంది. ఆశ్రమ్ హోటల్ ఉదంతంతో సిరీస్‌ను మొదలుపెట్టడంతో ఒక బలమైన హుక్ పాయింట్ దొరికింది. అయితే తర్వాత కథనం కేకేఎన్, ఎంఎస్ఆర్ల గతంలోకి వెళుతుంది. ఇండియా కథ చెప్పాలంటే కులాల కథ చెప్పాలనే కోణంలో తొలి ఎపిసోడ్ నడుస్తుంది. రెడ్డి, కమ్మ, కాపు… ఈ మూడు కులాలను చాలా షార్ప్‌గా ఎస్టాబ్లిష్ చేశాడు. శివారెడ్డి పాత్రతో ఫ్యాక్షన్‌ను కూడా టచ్ చేశాడు. శివారెడ్డి మతమార్పిడి కోణాన్ని కూడా తీసుకొచ్చాడు. అటు విజయవాడలో కుల ఘర్షణలు, అక్కడి రాజకీయ సామాజిక పరిస్థితులను చూపించాడు. ‘రెడ్డి గారు’ సంస్కృతిని చూపించాడు. సున్నితమైన అంశాలను కూడా టచ్ చేశాడు.
కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రలను అక్కడక్కడా ఫిక్షన్ చేయడం తప్పితే ఈ సిరీస్ కోసం దేవకట్టా కథ రాసుకోలేదనే చెప్పాలి. పబ్లిక్‌లో ఉన్న సమాచారంతోనే కథనం నడిపాడు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై అవగాహన ఉన్నవారికి ఈ సిరీస్ మొత్తం ఒకసారి చదివేసిన పుస్తకం లానే ఉంటుంది. అవగాహన లేనివారికి మాత్రం అసలు కథనమే లేని ఓ కథలా అనిపించే ఛాన్స్ ఉంది.
కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రలు ఈ సిరీస్‌కు మెయిన్ ఎట్రాక్షన్. అయితే ఆ పాత్రలకు సంబంధించిన వాస్తవాలు తప్పితే ఫిక్షన్ అంత బలంగా కుదరలేదు. అందుకే వాళ్లు ఐరా పార్టీలో జాయిన్ అయ్యే వరకూ సీన్స్ కాస్త విడ్డూరంగానే అనిపించే ఛాన్స్ ఉంది. ఐరా ఎమర్జెన్సీ నేపథ్యంలో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఐరా కొడుకు సందీప్ బసు (పేర్లు మారిపోయాయి) ఎమర్జెన్సీ సమయంలో ఇచ్చిన ఐదు అంశాల ప్రోగ్రాంలో “కుటుంబ నియంత్రణ” ఒక ముఖ్య అంశంగా నిలిచిందని కొన్ని కథనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో దాన్ని గ్లోరిఫై చేసి ఏకంగా దానిపై ఒక ఎపిసోడ్ నడిపారు. బలవంతంగా చేసే వాసక్టమీ ఆపరేషన్స్‌లో కృష్ణమనాయుడు రాడికల్‌గా వ్యవహరించాడనే తరహాలో ఒక సీక్వెన్స్ ఉంది. ఈ సిరీస్ జనాల్లోకి వెళ్లాక వైరల్ అయ్యే ఎపిసోడ్ అది. అంతేకాదు కృష్ణమనాయుడికి ఒక హీరోయిన్‌తో లవ్ స్టోరీ కూడా పెట్టారు. ఆ హీరోయిన్ తెలుగువారి అభిమాన నటుడు రాయపాటి చంద్రశేఖరరావు (ఆర్సీఆర్)తో జంటగా సినిమా చేయడం కూడా చూపించారు. దీనిపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇదంతా ఫిక్షనే కదా అనుకొంటే ఏ గొడవా లేదు.
మొత్తం తొమ్మిది ఎపిసోడ్ల సిరీస్‌లో మొదటి రెండు ఎపిసోడ్లు బాగానే నడుస్తాయి కానీ తర్వాత కథనం అంత జోరుగా ఉండదు. ఆరో ఎపిసోడ్ నుంచి కేకేఎన్, ఎంఎస్ఆర్ సభలోకి రావడం, జాతీయ రాజకీయాలు ప్రవేశించిన తర్వాత మళ్లీ సన్నివేశాలు జోరందుకుంటాయి. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన పెద్దాయన ప్రవేశం ఏడో ఎపిసోడ్ చివర్లో ఉంటుంది. ఆ తర్వాత ఎపిసోడ్ చకచక సాగిపోతుంది. మళ్లీ ఆశ్రమ్ హోటల్ దగ్గర పెద్దాయనపై జరిగిన దాడి సన్నివేశంతో తొలి సీజన్‌కు తెర వేసి అసలైన రాజకీయం రెండో సీజన్లో ఉండబోతుందని హింట్ ఇచ్చారు.
కృష్ణమనాయుడిగా ఆది పినిశెట్టి, రామిరెడ్డిగా చైతన్యరావు సహజంగా కనిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ పాత్రలను ఫిక్షన్ చేయడంలో దర్శకుడు కావాల్సినదానికంటే ఎక్కువ స్వేచ్ఛ తీసుకున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా కృష్ణమనాయుడి పాత్రకు నత్తి ఎందుకు పెట్టాడో క్లారిటీ ఉండదు. అంతేకాదు ఒక ప్రేమ కథ తగిలించేశాడు. అలాగే రామిరెడ్డిని ఆర్సీఆర్కు అభిమానిగా చూపించాడు. అలాగే రామిరెడ్డి ప్రేమ వివాహం కూడా అంతగా అతకదు. ఆర్సీఆర్గా సాయికుమార్ నటన బావుంది. ఆయన వాయిస్ కలిసోచ్చింది. ప్రధాని ఐరా బసు పాత్రలో దివ్యదత్ బాగానే కుదిరింది. ఆమె హిందీ ఇంగ్లిష్‌లో మాట్లాడటం ప్రామాణికతను తీసుకొచ్చింది. ఆ పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పారో గానీ, ఆ గొంతులోనే ఓ గాంభీర్యాన్ని జోడించగలిగారు. చేవెళ్ల భాస్కరరావు పాత్ర మాత్రం కాస్త కామెడీ రిలీఫ్. శ్రీకాంత్ అయ్యంగారు ఆ పాత్రలో కావాల్సినదానికంటే ఎక్కువ చేసి నవ్వించాడు. రామిరెడ్డి తండ్రి శివారెడ్డిగా కనిపించిన నటుడికి మంచి మార్కులు పడతాయి. మిగతా నటీనటులు సహజంగా కనిపించారు.
టెక్నికల్‌గా సిరీస్ బావుంది. మంచి ప్రొడక్షన్ వర్క్ కనిపించింది. కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్ అలనాటి పరిస్థితులను కళ్లముందుకు తీసుకొచ్చాయి. నేపధ్య సంగీతం బాగా కుదిరింది. డైలాగులు రాయడంలో దేవకట్టా దిట్ట. ఆయన రాసిన బలమైన డైలాగులు ప్రతి ఎపిసోడ్‌కు క్లిప్ హ్యాంగర్స్‌గా వాడారు. ”సిపాయిలు సిపాయిలు పొడుచుకుంటే సిపాయిగానే చస్తాం. కొడితే రాజుని కొట్టాలి. లేదా వాడికింద బానిసబగా బ్రతకాలి”. ”డిక్టేటర్షిప్ లీడర్షిప్ కాదని ఎవరు చెప్పారు” సన్నివేశానికి బలాన్ని ఇచ్చే ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి.
అందరికీ కనెక్ట్ అయ్యే సిరీస్ కాదిది. ‘మినిమం డిగ్రీ ఉండాలి’ అనే మీమ్ డైలాగ్‌లా మయసభలోని ఈవెంట్స్ ఫాలో అవ్వాలంటే తెలుగు రాష్ట్ర రాజకీయాలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, కుల సమీకరణలు, ఫ్యాక్షనిజం, నక్సలిజం, ఎమర్జెన్సీ, ఇందులో చూపించిన పాత్రల నిజ జీవితాలు… ఇలా బోలెడు విషయాల మీద ఎంతోకొంత పరిచయం ఉండాలి. అప్పుడే దేవకట్టా క్రియేట్ చేసిన మయసభ ప్రేక్షకుడికి పడుతుంది. అలా కాకుండా ఈ సిరీస్ చూసి నిజ జీవిత సంఘటనలతో మ్యాచ్ చేసుకుంటే కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ పెంచుకునే ఛాన్స్ కూడా ఉంది.