రివ్యూ : బాబోయ్‌… ‘మేడ‌మీద అబ్బాయ్’

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

న‌రేష్ అంటేనే న‌వ్వులు. కాసేపు స‌ర‌దాగా న‌వ్వుకొందాం అనుకొన్న‌వాళ్ల‌కు న‌రేష్ సినిమాలు మంచి ఆప్ష‌న్‌! కాక‌పోతే ఆ న‌వ్వులు ఇప్పుడు టీవీల్లోనూ దొరికేస్తున్నాయి. జ‌బ‌ర్‌ద‌స్త్ పుణ్య‌మా అని కామెడీ మ‌రీ చీప్ అయిపోయింది. సెల్ ఫోన్‌, వాట్స‌ప్‌నిండా జోకులే. దాంతో న‌రేష్ న‌వ్వించ‌డానికి కొత్త దారులు వెదుక్కోవాల్సివ‌స్తోంది. అందుకే… విజ‌యాలు దూర‌మైపోయాయి. ఈసారి హిట్టుకొట్టాల్సిన ప‌రిస్థితి తెచ్చుకొన్నాడు. డూ ఆర్ డై సెట్యువేష‌న్‌లో న‌రేష్ చేసిన సినిమా.. మేడ‌మీద అబ్బాయి. మ‌రి ఈ అబ్బాయైనా న‌రేష్‌ని గ‌ట్టెక్కించాడా?? లేదంటే మెట్ల‌పై నుంచి న‌రేష్ బోర్లా ప‌డ్డాడా?? చూద్దాం.. రండి.

* క‌థ‌

శీను (అల్ల‌రి న‌రేష్‌) బీటెక్‌లో 24 స‌బ్జెక్టులూ ఫెయిల్ అయిన‌… మ‌హా మేధావి. ఏం చేయాలో తెలీక‌… డైరెక్ష‌న్ చేద్దామ‌ని ఫిక్స‌వుతాడు. అందుకోసం ఊర్లోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తాడు. అది కాస్త కాల‌వ‌లో కొట్టుకెళ్లిపోతుంది. ఇంట్లో నాన్నేమో.. ‘మ‌న ప‌చారి కొట్టులో పొట్లాలు క‌ట్టు.. ‘అంటూ ఆర్డ‌రేస్తాడు. సినిమాల‌పై వ్యామోహంతో రాత్రికి రాత్రే ఎవ‌వ‌రికీ చెప్ప‌కుండా హైద‌రాబాద్ వ‌చ్చేస్తాడు. అదే ట్రైన్‌లో వాళ్ల ఎదురింటి అబ్బాయి సింధు (నిఖిల‌) తార‌స ప‌డుతుంది. తానేమో.. ఉద్యోగం నిమిత్తం హైద‌రాబాద్ వెళ్తుంటుంది. అప్ప‌టికే ఊర్లో సింధు త‌న‌కి ప‌డిపోయింద‌ని తెగ బిల్డ‌ప్పులిస్తాడు శ్రీ‌ను. సింధుతో ఓ సెల్పీ దిగి త‌న స్నేహితుడు బాబ్జీ (హైప‌ర్ ఆది)కి పంపుతాడు. హైద‌రాబాద్‌లో స్టూడియోల చుట్టూ తిరిగి.. తిరిగి వారం త‌ర‌వాత మ‌ళ్లీ ఇంటికొచ్చేస్తాడు శ్రీ‌ను. కాక‌పోతే ఈలోగా బాబ్జీ చేసిన ఓ పొర‌పాటు వ‌ల్ల సింధు, శ్రీ‌నులు హైద‌రాబాద్ పారిపోయార‌ని ఆ ఊర్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. దాంతో ఊర్లో దోషిగా నిల‌బ‌డ‌తాడు శ్రీ‌ను. ఇంత‌కీ సింధు ఎక్క‌డికి వెళ్లింది? సింధుని వెదికే క్ర‌మంలో శ్రీ‌నుకి తెలిసిన నిజాలేంటి?? అనేదే మిగిలిన క‌థ‌.

* విశ్లేష‌ణ‌

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన వ‌రు ఒక్క‌రు సెల్ఫీ అనే క‌థ‌కి ఇది రీమేక్‌. ఈ సినిమా అసాంతం చూస్తే.. ఈ క‌థ మ‌ల‌యాళంలో ఎలా ఆడేసింద‌బ్బా?? అనిపిస్తుంది. ఓ సెల్ఫీ… దాని చుట్టూ న‌డిచే మిస్ అండ‌ర్‌స్టాండింగ్ మ‌ధ్య న‌డిపిన డ్రామా ఇది. అయితే… అది ఏమాత్రం క‌న్వెన్సింగ్ గా అనిపించ‌దు. హైద‌రాబాద్ బ‌య‌ల్దేరిన శ్రీ‌ను సెల్‌ఫోన్‌ని ఎవ‌రో దొంగిలిస్తారు. దాంతో శ్రీ‌ను ఎక్క‌డున్నాడో ఏం చేస్తున్నాడో ఇంట్లో వాళ్ల‌కీ, ఊర్లో వాళ్ల‌కీ తెలియ‌దు అనుకోవొద్దు. ఓ అనుమానాన్ని నిజం అనేసుకొన్నారేమో అనుకోవొచ్చు. కానీ… సింధు సెల్ ఫోన్ పని చేస్తూనే ఉంది క‌దా? సింధుకి ఫోన్ చేస్తే విష‌యం మొత్తం తెలిసిపోతుంది క‌దా?? ఇంత చిన్న లాజిక్‌ని మిస్స‌యిపోయి… రెండుగంట‌ల సినిమా తీసేశారంటే ద‌ర్శ‌కుడ్ని ఏమ‌నాలి?? ఆ నిర్మాత‌ల ధైర్యాన్ని ఏమ‌ని వ‌ర్ణించాలి?? ఇదో స‌స్పెన్స్ డ్రామా. దానికి న‌రేష్ శైలి వినోదం జోడిద్దామ‌నుకొన్నారు. కానీ.. ఆ వినోదం, స‌స్పెన్స్ రెండూ అర‌కొర‌గానే పండాయి. పేప‌ర్ లీకేజీ ఎపిసోడ్‌తో మొద‌లైంది సినిమా. ఈ త‌ర‌హా జోకులు వైవా హ‌ర్ష షార్ట్ ఫిల్మ్‌లో తెగ చూసేశారు. దాంతో బీటెక్ అబ్బాయిల మీద వేసిన‌ ఆ జోకులు విన్న‌ట్టుగానే అనిపిస్తాయి. ఊర్లో న‌రేష్ మిత్ర‌బృందంపై సాగిన స‌న్నివేశాలు, షార్ట్ ఫిల్మ్ ఎపిసోడ్ క‌థ‌కు ఏత్రం అవ‌స‌రం లేనివే. మ‌ధ్య‌మ‌ధ్య‌లో హైప‌ర ఆది.. జ‌బ‌ర్‌ద‌స్త్ ఎపిసోడ్ల‌లో పంచ్‌ల్ని వేసి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా చేసినా.. హైప‌ర్ క‌నిపించిన ప్ర‌తీ స‌న్నివేశం ఈటీవీలో జ‌బ‌ర్‌ద‌స్త్ ఎపిసోడ్ల‌నే గుర్తు చేస్తుంది.

ద్వితీయార్థంలో క‌థానాయిక‌ని వెదుకుతూ చేసిన ప్ర‌హ‌స‌నం కూడా బోర్ కొట్టిస్తుంది. హీరో అండ్ గ్యాంగ్ ఒక ఊరు నుంచి మ‌రో ఊరికి, మ‌రో ఊరు నుంచి ఇంకో ఊరుకి వెళ్లే ఎపిసోడ్లు కూడా… విసుగెత్తిస్తాయి. ఊరెళ్లారు.. అనే చిన్న పాయింట్ చప్ప‌డానికి ఊరు ఎలా వెళ్లారో, ఏయే బ‌స్సులు ఎక్కారో, మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఎక్క‌డెక్క‌డ ఆగారో, అక్క‌డ ఏమేం చేశారో చెప్పాల్సిన ప‌ని లేదు క‌దా?? కేవ‌లం సమ‌యాన్ని గ‌డ‌ప‌డానికే ద‌ర్శ‌కుడు ఆయా స‌న్నివేశాలు రాసుకొన్నాడేమో అనిపిస్తుంది. ప‌తాక దృశ్యాల్లో ఓ ట్విస్టు దాచుకొన్నాడు ద‌ర్శ‌కుడు. అదొచ్చేస‌రికే.. ప్రేక్ష‌కుల్లొ నీర‌సం ఆవ‌హిస్తుంది. ఫేస్ బుక్ లో అప‌రిచిత వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు వ‌ద్దు అనే పాయింట్ చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు ఇంత స‌మ‌యం వృథా చేశాడా అనిపిస్తుంది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

న‌రేష్ నుంచి వినోద‌మే ఆశిస్తాం. లేదంటే గాలి శీనులా… అద్వితీయ‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రిస్తే ఆహా అంటాం. ఈ సినిమాలో రెండింటికీ దూరం అయ్యాడు న‌రేష్‌. న‌రేష్ చేయ‌ద‌గిన పాత్ర కాదిది. ఎంచుకోవాల్సిన క‌థా కాదు. సెకండాఫ్‌లో క‌నిపించే సోదికి న‌రేష్ ఎలా సూట‌వుతాడ‌ని ఊహించారో ఏంటో?? హైప‌ర్ ఆది.. కావాల‌ని వేసిన పంచ్‌లు కొన్ని పేలాయి.. ఇంకొన్ని జ‌బ‌ర్ద‌స్త్‌నే గుర్తు చేశాయి. నిఖిల హీరోయిన్ మెటీరియ‌ల్ కాదు. దానికి తోడు ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గానూ చూపించ‌లేదు. ఎప్పుడూ డ‌ల్‌గానే క‌నిపిస్తుంది. శ్రీ‌నివాస్ అవ‌స‌రాల పాత్ర‌నీ స‌రిగా డిజైన్ చేయ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. మిగిలిన వాళ్లెవ్వ‌రికీ అంత స్కోప్ లేదు.

* సాంకేతిక వ‌ర్గం

మ‌ల‌యాళ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌జీత్‌నే ఈ సినిమా కోసం ఎంచుకొన్నారు. మ‌ల‌యాళంలో ఫీల్‌ని ఏమాత్రం త‌గ్గ‌కుండా తెర‌కెక్కిస్తాడ‌ని చిత్ర‌బృందం భావించి ఉంటుంది. అయితే.. అక్క‌డ ఎలాగూ హిట్ కొట్టాం క‌దా అని… ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది. క‌థ‌కు సంబంధం లేని చాలా సీన్లు వ‌స్తు పోతుంటాయి. లాజిక్‌ల్ని గాలికి వ‌దిలేసిన ద‌ర్శ‌కుడు, సినిమాటిక్ లిబ‌ర్టీస్ చాలా తీసుకొన్నాడు. షాన్ సంగీతంలో ఓ పాట అల‌రిస్తుంది. నేప‌థ్య సంగీతం కూడా అంతంత మాత్ర‌మే.

* ఫైన‌ల్ ట‌చ్ : ఈ సెల్ఫీకి అంత సీన్ లేదు

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.