టాలీవుడ్ పెద్ద దిక్కు అభిమానాన్ని, సహకారాన్ని దూరం చేసుకుంది. తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఆ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఉపముఖ్యమంత్రి అసహనంతో ఉన్నారు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి మీడియా నోట్ పంపించారు.
తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని పవన్ కల్యాణ్ గారు సూచించినా సానుకూలంగా స్పందించలేదని డిప్యూటీ సీఎం కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఎలాంటి టార్చర్ పెట్టిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. రూ. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం. సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు.. అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కల్యాణ్ సూచించారు. అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని స్పష్టం చేశారు.
ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలపై పవన్ ఇప్పటికే దృష్టి పెట్టారు. థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని గుర్తించార..ుు అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా ఈ సందర్భంగా చర్చించారు.